పాతకక్షలే కారణమా? | Was at the old faction? | Sakshi
Sakshi News home page

పాతకక్షలే కారణమా?

Published Wed, May 4 2016 3:29 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

Was at the old faction?

ఎస్‌బీఐ ఫ్రాంచైజీ నిర్వాహకుడిపై కాల్పుల కేసు
* విచారణ వేగవంతం చేసిన పోలీసులు
* బ్యాంక్ ఖాతాల పరిశీలన

రాజేంద్రనగర్: కాటేదాన్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద గల జీయో సంసార్ ప్రైవేట్ మనీ ట్రాన్స్‌ఫర్ ఏజెన్సీ వద్ద సోమవారం మధ్యాహ్నం జరిగిన కాల్పులు పాతకక్షల నేపథ్యంలోనే జరిగి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఇప్పటికే బాధితుడు ప్రసాద్ నుంచి వివరాలు సేకరించడంతో పాటు అతడి స్నేహితులు, పరిచయస్తులను పిలిచి మాట్లాడుతున్నారు.

అలాగే అదే ఏజెన్సీలో పనిచేసే మరో ఏజెంట్ మున్నా చెప్తున్న మాటలకు, ప్రసాద్ చెప్తున్నదానికి పొంతన లేకపోవడంతో అసలు ఏమి జరిగిందనేది తెలుసుకొనే పనిలో పడ్డారు. అనుమానితుడు డబ్బు పంపించిన బ్యాంక్ ఖాతా నంబర్ యూపీలోని ఎస్‌బీఐ బ్రాంచ్‌దిగా తెలిసింది. దుండగుడు రూ.500లు ప్రసాద్‌కు ఇస్తే రూ. 475 డిపాజిట్ చేసి, రూ.25లు కమిషన్‌గా తీసుకున్నట్టు గుర్తించారు. ఆర్థిక లావాదేవీలు, ప్రేమ వ్యవహారం తదితర వాటిపై ప్రసాద్, మున్నా కుటుంబసభ్యులు, స్నేహితుల నుంచి పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్టు తెలిసింది.

కాగా, కాల్పులు జరిపిన దుండగుడు మాట్లాడిన భాషను బట్టి అతను బీహారీ కావచ్చని బాధితుడు చెప్పడంతో పోలీసులు స్థానికంగా పని చేస్తున్న బీహార్ కార్మికులను సైతం పిలిచి విచారిస్తున్నారు.  
 
కానరాని సీసీకెమెరాలు...
పోలీసులు ఓ పక్క స్థానికుల సహాయంతో పెద్ద ఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. అయితే, అతిపెద్ద పారిశ్రామికవాడ అయిన కాటేదాన్‌లో వీటి జాడలేకపోవడం గమనార్హం. పారిశ్రామికవేత్తలు తమ లావాదేవీలన్నీ కాటేదాన్ ఎస్‌బీఐలో నిర్వహిస్తారు. ఈ ప్రాంతంలోనూ సీసీ కెమెరాలు లేవు. ప్రధాన చౌరస్తాతో పాటు పారిశ్రామికవాడలోని రహదారులపై కూడా కెమెరాలు ఏర్పాటు చేయలేదు. ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉంటే ప్రసాద్‌పై కాల్పులు జరిపిన వ్యక్తిని సులభంగా గుర్తుపట్టేందుకు పోలీసులకు వీలు కలిగి ఉండేది.
 
పుకార్ల షికార్లు: కాల్పులపై పోలీసులు మంగళవారం కూడా ఎలాంటి వివరాలు వెల్లడించకపోవడంతో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. ప్రసాద్, కాల్పులు జరిపిన యువకుడు బుద్వేల్ రైల్వేస్టేషన్ ప్రాంతానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నారని, ఇదే కాల్పులకు దారి తీసిందని కొందరంటే.. తోటి ఏజెంట్‌తో ప్రసాద్‌కు ఉన్న ఆర్థిక వివాదాలతోనే కాల్పులు జరిగాయని మరికొందరు పుకార్లు సృష్టించారు. ఒకరైతే రోహిత్ శర్మ అనే వ్యక్తి దొరికాడని, అతనే కాల్పులు జరిపాడని అన్నారు. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా దర్యాప్తు జరుగుతోందని, అన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement