
నగరంలో నేరాల నియంత్రణ, బాధితులను ఆదుకోవడం, సత్వరం స్పందించడం, సమన్వయం, క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటి కప్పుడు పర్యవేక్షించడం వంటి చర్యల కోసం పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్‌ఫోన్‌లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కల్పిస్తున్నారు. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే ఈ సౌకర్యం ద్వారా ఉన్నతాధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్‌ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ ‘లైవ్’ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.
సాక్షి, సిటీబ్యూరో: చిరాగ్ అలీ లైన్‌లోని ఓ చోట ఘర్షణ జరుగుతోందని అబిడ్స్ పోలీసులకు సమాచారం వచ్చింది. ఆ ప్రాంతంలో పరిస్థితి స్పష్టంగా తెలుసుకోవడానికి ప్రస్తుతం సిబ్బందిని పంపాల్సి ఉంటుంది. వారు అక్కడకు వెళ్ళి, పరిశీలించి, సమాచారం అందించేందుకు కొంత సమయం పడుతుంది. అప్పటి వరకు అధికారులు తదుపరి చర్యలు తీసుకోవడానికి ఆస్కారం లేదు.
హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద ఓ నిరసన కార్యక్రమం నేపథ్యంలో అధికారులు కొందరు సిబ్బందిని మోహరించారు. అయితే ధర్నాకు ఊహించిన సంఖ్య కంటే ఎక్కువ మందే వచ్చారు. ఈ విషయం క్షేత్ర స్థాయిలో ఉండే సిబ్బంది తెలిపే వరకు ఉన్నతాధికారులకు తెలియదు. దీంతో అదనపు సిబ్బంది మోహరింపునకు జాప్యం జరుగుతోంది.
ఇలాంటి ఇబ్బందుల్ని తొలగించేందుకు నగర పోలీసు విభాగం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. పోలీసు అధికారిక యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఆధునిక హంగులు జోడిస్తోంది. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న ఇవి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తే..ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు తమ సెల్‌ఫోన్‌లోనే కోరుకున్న ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరా ఫీడ్‌ను లైవ్‌లో చూసే ఆస్కారం కలుగుతుంది. ‘సీసీ కెమెరా లైవ్’ పేరుతో అందుబాటులోకి వచ్చే దీంతో ఉన్నతా«ధికారులు సైతం ఎప్పటికప్పుడు తన సెల్‌ఫోన్ల ద్వారానే క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల్ని తెలుసుకోవచ్చు. సత్వర స్పందన, సమన్వయం, సమాచారమార్పిడి కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన యాప్ ‘హైదరాబాద్ కాప్’లో ఈ తరహా హంగుల్ని చేరుస్తున్నారు. న్యూ ఇయర్ డే అయిన జనవరి 1 నుంచి ఈ లైవ్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.
క్రైమ్ మ్యాపింగ్‌లో హంగులు జోడిస్తూ...
నగర కమిషనరేట్ పరిధిలో మొత్తం ఐదు జోన్ల పరిధిలో 60 పోలీసుస్టేషన్లు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒకే సమయంలో ఒకే తరహా నేరాలు జరుగవు. అయితే ఎక్కడ, ఎప్పుడు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయన్నది తెలుసుకోవడం ద్వారానే వాటిని నిరోధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు నిర్ధిష్టంగా తెలుసుకోవడానికి ‘క్రైమ్ మ్యాపింగ్’లో ‘థిమేటిక్ క్రైమ్ మ్యాప్’ విభాగం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ఠాణాలు, సెక్టార్లు, బీట్లు తెలిసేలా సరిహద్దుల్నీ పొందుపరిచారు. దీన్ని మరింత అప్‌డేట్ చేస్తూ.. ఆయా ఠాణా పరిధిలో ఉన్న సున్నిత ప్రాంతాలు, మతపరమైన కట్టడాలు, సమస్యాత్మక ప్రాంతాలను మార్కింగ్ చేశారు.
మ్యాప్ మీదే ‘సీసీ కెమెరాలు’...
సిటీలోని అన్ని పోలీసుస్టేషన్ల పరిధిలో ఉన్న నేరాలు జరిగే ప్రాంతాలను డిజిటలైజ్ చేసినట్లే... ఆయా ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను మ్యాప్ పైకి తీసుకువచ్చారు. కొన్ని రకాలైన నేరాలు జరిగినప్పుడు అనుమానితుల గుర్తింపు, ఆధారాల సేకరణకు ఆ క్రైమ్ సీన్‌కు సమీపంలో, దారితీసే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి? అనేది తెలుసుకోవడానికి ప్రస్తుతం కొంత సమయం పడుతోంది. అలాంటి జాప్యానికీ తావులేకుండా క్షేత్రస్థాయి అధికారులు ఈ యాప్‌లోని ‘క్రైమ్ రాడార్’లోకి ప్రవేశిస్తే చాలు. ఈ నేరం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఎక్కడెక్కడ ఎన్ని కెమెరాలు ఉన్నాయనేది చూపిస్తుంది. మ్యాప్ పైన కనిపించే కెమెరా మార్క్ వద్ద క్లిక్ చేస్తే.. అది ఎక్కడ ఉందనే చిరునామా సైతం పాప్‌అప్ రూపంలో ప్రత్యక్షమవుతుంది.
తాజా దృశ్యాలూ కనిపించేలా...
పోలీసుస్టేషన్ పరిధిలో చోట ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయనో, పెద్ద ప్రమాదం జరిగిందనో పోలీసుస్టేషన్‌కు సమాచారం వచ్చినప్పుడు ఉన్నతాధికారులు ఘటనాస్థలిలో పరిస్థితుల్ని ఎంత త్వరగా తెలుసుకోగలిగితే.. పరిస్థితుల్ని చక్కదిద్దే చర్యల్ని అంతం వేగంగా చేపట్టే అవకాశం ఉంటుంది. దీనికోసం కేవలం సిబ్బంది పైనే ఆధారపడకుండా ‘సీసీ కెమెరా లైవ్’ సదుపాయం యాప్‌లో కల్పించారు. క్రైమ్ రాడార్‌లో కనిపించిన కెమెరా ఐకాన్ మీద క్లిక్ చేస్తే చాలు.. దాని ఫీడ్ లైవ్‌లో కనిపించనుంది. ఈ సౌకర్యం యాప్ ద్వారా సిబ్బంది, ఉన్నతాధికారుల సెల్‌ఫోన్లలోకూ అందుబాటులోకి వస్తోంది. అన్ని స్థాయిల్లో సిబ్బందికీ, అన్ని ప్రాంతాల్లో ఉన్న ఫీడ్‌ను లైవ్‌లో చూసే సౌకర్యం కల్పిస్తే... కొన్నిసార్లు ఇబ్బందులకు ఆస్కారం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా సిబ్బంది, అధికారులు విధులు నిర్వర్తించే ప్రాంతాల ఆధారంగా వారి ఫోన్లలోకి లింకేజ్ ద్వారా అందుబాటులో ఉంచాల్సిన లైవ్ ఫీడ్‌లను నిర్ణయిస్తున్నారు. ఉన్నతాధికారులకు మాత్రం నగర వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాలతో లింకేజ్ ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment