జల పరిరక్షణతోనే మానవాళి భవిష్యత్తు!
తెలంగాణ జల సంరక్షణ వేదిక ఆవిర్భావ సదస్సులో వక్తలు
- వాన నీటి సంరక్షణ ఉద్యమంలా సాగాలని పిలుపు
- వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఇకపై ఎరువుల వాడకమన్న పోచారం
- 230 కోట్ల మొక్కలు నాటుతామన్న మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్: ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టేలా చర్యలు చేపట్టినప్పుడే మానవాళి మనుగడ సాగిస్తుందని తెలంగాణ జల సంరక్షణ వేదిక అభిప్రాయపడింది. భూగర్భ జలాలు పెంచుకునే ప్రణాళికలను రూపొం దించి, దానిపై ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు ఉధృతంగా సాగాలని పిలుపునిచ్చింది. భవిష్యత్‌లో జల సంక్షోభాలు తలెత్తకుండా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించింది. హైదరాబాద్‌లోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో తెలంగాణ జల సంరక్షణ వేదిక, దక్కన్ వాటర్ హార్వెస్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్ సంయుక్తంగా ‘మేకింగ్ తెలంగాణ వాటర్ ఎఫిషియంట్ స్టేట్ బై 2020’ పేరిట సదస్సు నిర్వహించాయి.
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, పంచాయతీరాజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, వేదిక వ్యవస్థాపక చైర్మన్ వి.ప్రకాశ్, టీఎస్‌పీఎస్సీ సభ్యుడు విఠల్, సాక్షి ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి, సింగరేణి డెరైక్టర్ మనోహర్‌రావు, సీనియర్ జర్నలిస్టు అష్టకాల రామ్మోహన్ హాజరయ్యారు. నీటి సంక్షోభానికి వర్షపాతం తగ్గడం కారణం కాదని... కురిసిన ప్రతి నీటిబొట్టును సద్వినియోగం చేసుకోకపోవడమే కారణమని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు. భూగర్భ జలాలు పెంచుకునేలా చర్యలు చేపట్టాలని.. వాన నీటిని సంరక్షించి, భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వ్యవసాయాధికారి ధ్రువీకరిస్తేనే ఎరువులు: పోచారం
రాష్ట్రంలో ఎరువుల వాడకంపై రైతుల్లో అవగాహన పెంచేందుకు ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక వ్యవసాయ విస్తారణాధికారి, మం డలానికో వ్యవసాయాధికారి, డివిజన్‌కు ఒక ఏడీ ఉండేలా చర్యలు చేపట్టామని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. వ్యవసాయ విస్తరణాధికారి రైతుల పొలాలను పరిశీలించి చేసే సూచనల మేరకే ఫర్టిలైజర్ దుకాణాలవారు ఎరువులు, పురుగు మం దులు ఇచ్చే విధానాన్ని తీసుకురాబోతున్నామని చెప్పారు. రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.
ఇక రాష్ట్రంలో పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు 230 కోట్ల చెట్లను నాటే లక్ష్యంతో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని మంత్రి జోగు రామన్న చెప్పారు. ఇప్పటికే 15కోట్ల మొక్క లు నాటామని, రాష్ట్రంలో 24 శాతంగా ఉన్న అడవుల విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. నీటి సంరక్షణ అందరి బాధ్యత అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో సేంద్రియ ఎరువుల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరముందని ‘సాక్షి’ ఎడిటోరియల్ డెరైక్టర్ కె.రామచంద్రమూర్తి అభిప్రాయపడ్డారు. సేంద్రియ ఎరువుల వాడకం వైపు రైతులు మళ్లేలా అవగాహన, ప్రోత్సాహకాలు అందించాలని సూచించారు.