కేసీఆర్ ఫాంహౌస్‌లో చర్చకైనా మేం సిద్ధం
బీజేపీ ఎమ్మెల్యే చింతల
- కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.1.16 లక్షల కోట్ల సహాయం
- ఆధారాలతో సహా బహిరంగ చర్చకు మేం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ రూపాల్లో రూ.1.16 లక్షల కోట్ల సహాయం అందిందని బీజేపీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. కేంద్రం అందించిన సహాయాన్ని ఆధారాలతో సహా వివరించేందుకు బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ నుంచి రాలేకపోయినట్లయితే తామే అక్కడికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ, కేంద్రం ఒక్క రిజర్వుబ్యాంకు ద్వారానే రాష్ట్రానికి రూ.56,693 కోట్లు బదిలీ చేసిందని తెలిపారు.
అలాగే వివిధ సంక్షేమ పథకాల కోసం రూ.50 వేల కోట్ల సహాయం చేసిందని వివరించారు. గ్రామీణ సడక్ యోజన, సర్వశిక్షా అభియాన్, డిజిటల్ ఇండియా తదితర పథకాలకింద రాష్ట్రానికి విస్తృత సహాయం అందుతోందన్నారు. వాస్తవాలను అమిత్ షా వెల్లడించేసరికి టీఆర్‌ఎస్ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. కరువు సహాయం కింద కేంద్రం రూ.791 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేస్తే ఇప్పటి వరకు రైతులకు అందజేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం విషయంలో కేంద్ర ప్రభుత్వం హడ్కో ద్వారా రుణాలు ఇవ్వకపోతే ముందుకు వెళ్లేదా? అని ప్రశ్నించారు. అన్ని విషయాలు తెలిసుండి కూడా మంత్రి ఈటల రాజేందర్ ఎందుకంత అసహనానికి గురవుతున్నారో అర్థం కావడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పాలన చేతకాక తమపై విమర్శలు చేస్తోందన్నారు. ఈ రెండేళ్ల కాలంలో సీఎం కేసీఆర్ సచివాలయానికి ఎన్నిసార్లు వెళ్లారో? ఫాంహౌస్‌కు ఎన్ని సార్లు వెళ్లారో శ్వేతపత్రం విడుదల చేయాలని చింతల డిమాండ్ చేశారు.