
నిరుద్యోగుల ఆశలు వమ్ముకానీయం
మంత్రి కేటీఆర్ వెల్లడి
‘తెలంగాణ స్టేట్ డాటా సెంటర్’ ఏర్పాటు చేస్తాం
డాటా సెంటర్‌తో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు అనుసంధానం
ప్రైవేటు క్లౌడ్ కేంద్రాలపై ఆధారపడే అవసరం ఉండదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్ ప్రభుత్వం వారి ఆశలు వమ్ముకానీయదని రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగాలను ప్రణాళికాబద్ధంగా భర్తీ చేస్తుం దని, భవిష్యత్తులోనూ ఇదే పారదర్శకతతో ముందుకెళ్తుందన్నారు. తెలంగాణ ఉద్యమ శీర్షిక అయిన నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో చర్యలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికే నీళ్లలో అన్యాయాలను సరిచేస్తున్నామన్నారు. నిధుల విషయంలోనూ పెట్టుబడులు సాధించామని, సొంత ఆదాయం సమకూర్చుకుంటున్నామన్నారు. ఇక నియామకాల్లో పారదర్శకతను పాటిస్తూ ఉద్యమ శీర్షికకు సంపూర్ణ న్యాయం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ), అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆదివారం హెచ్‌ఎండీఏ పరి ధిలో ఏర్పాటు చేసిన 48 కేంద్రాల్లో ఆన్‌లైన్ పరీక్షలను టీఎస్‌పీఎస్సీ నిర్వహించింది. ఆ పరీక్షల నిర్వహణను టీఎస్‌పీఎస్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కమాండ్ కంట్రోల్ సెంటర్ పనితీరును కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి పరిశీలించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ స్టేట్ డాటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. టీఎస్‌పీఎస్సీ ప్రస్తుతం ప్రైవేటు క్లౌడ్ కంప్యూటింగ్ సెంటర్లపై ఆధారపడి ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహిస్తోందని, ఇకపై అవసరం లేకుండా చేస్తామని తెలిపారు.
డాటా సెంటర్‌కు టీఎస్‌పీఎస్సీ పరీక్షలను అనుసంధానం చేస్తామన్నారు. అవసరమైతే స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్‌ను దీనికి జోడిస్తామని, తద్వారా మారుమూల తండాలు, గ్రామాల వారు హైదరాబాద్‌కు వచ్చి పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా, వారి తాలూకా/జిల్లా కేంద్రాల్లో పరీక్షలు రాసేలా చర్యలు చేపడతామన్నారు. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల భర్తీలో పారదర్శకంగా, గత పరిస్థితులకు పూర్తి భిన్నంగా పనిచేస్తోందని కితాబునిచ్చారు. యూపీఎస్సీ కూడా నాలుగైదు వేల మందికి ఆన్‌లైన్ పరీక్ష నిర్వహించలేదని, టీఎస్‌పీఎస్సీ మాత్రం 60 వేల మందికి నిర్వహించి చరిత్ర సృష్టించిందన్నారు. ఉద్యమ సమయంలో ఘంటా చక్రపాణి టీవీల్లో కనిపించే వారని, ఇపుడు కనిపించకపోయినా బాగా పనిచేస్తున్నారన్నారు. దేశంలోని ఇతర కమిషన్లకు టీఎస్‌పీఎస్సీ ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దుతున్నారన్నారు.
టీఎస్‌పీఎస్సీ చేపట్టిన ఓటీఆర్‌లో6 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, దీంతో టీఎస్‌పీఎస్సీ వర్చువల్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌గా మారిందన్నారు. మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కమిషన్ ఏర్పడిన 8 నెలల్లోనే దేశం మొత్తం తెలంగాణ వైపు చూసేలా చర్యలు చేపట్టారని కొనియాడారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్ల సదస్సు ఇక్కడ నిర్వహిస్తున్నారన్నారు. గతంలో నోటిఫికేషన్లలో కొన్ని రద్దయ్యేవని, కాలయాపన జరిగేదని, ఇపుడు అలాకాకుండా 24 గంటల్లోనే ఫలితాలు వెల్లడయ్యేలా చర్యలు చేపడుతున్నారన్నారు.
చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. దేశంలోనే రాష్ట్రాన్ని ఐటీ రాజధానిగా మార్చేందుకు కేటీఆర్ కృషి చేస్తున్నారని, వారి స్ఫూర్తితో తాము చర్యలు చేపట్టామన్నారు. అన్ని విభాగాల పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ హబ్ కావాలని, కంప్యూటర్ ల్యాబ్, సర్వర్ స్టోరేజ్ ప్రభుత్వ విభాగంలో ఏర్పాటు చేయాలని కోరారు. స్కిల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా జిల్లాల్లోనూ కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే నిరుద్యోగులకు శిక్షణతోపాటు పరీక్షల నిర్వహణకు ఉపయోగపడతాయని వివరించారు. అన్ని ఇంజనీరింగ్ కాలేజీల్లో వెబ్ కెమెరాలు పెట్టాలన్నారు. కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, కమిషన్ సభ్యులు సి.విఠల్, డాక్టర్ చంద్రావతి, మతీనుద్దీన్ ఖాద్రీ, రామ్మోహన్‌రెడ్డి, విద్యాసాగర్‌రావు తదితరులు పాల్గొన్నారు.