బాలికలకేదీ భరోసా? | Where is the Ensuring to the girls | Sakshi
Sakshi News home page

బాలికలకేదీ భరోసా?

Published Tue, Oct 18 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

బాలికలకేదీ భరోసా?

బాలికలకేదీ భరోసా?

ప్రపంచంలో బాలికలకు అత్యంత సురక్షిత దేశం ఏది? బాల్యం, విద్యాభ్యాసం, వివాహం, ఆరోగ్యం, భద్రత, సుస్థిర భవిష్యత్తుకు భరోసా ఇచ్చే దేశం ఏది? ‘సేవ్ ది చిల్డ్రన్’ అనే స్వచ్ఛంద సంస్థ.. ‘ఎవ్రీ లాస్ట్ గర్ల్’ పేరిట ఇటీవల వెలువరించిన నివేదికను పరిశీలిస్తే పై ప్రశ్నలకు ‘భారత్’ అని ధైర్యంగా సమాధానమివ్వలేం. బాలికల విద్యాభ్యాసం, బాల్య వివాహాలు, టీనేజ్‌లో గర్భం దాల్చడం, ప్రసూతి మరణాలు, మహిళా ఎంపీల శాతాన్ని సూచీలుగా ఉపయోగిస్తూ ఈ సంస్థ నివేదిక రూపొందించింది. అందులో మొత్తం 144 దేశాలకు గాను భారత్ 90వ స్థానంలో ఉండడం దేశంలో బాలికల స్థితిగతులకు అద్దంపడుతోంది. సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్ మనకంటే మెరుగైన స్థితిలో ఉండడం గమనార్హం.
 - సాక్షి, హైదరాబాద్

 ప్రతి ఏడు సెకన్లకు ఓ బాల్య వివాహం

 ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడు సెకన్లకు ఓ బాల్య వివాహం (15 ఏళ్ల లోపు) జరుగుతున్నట్లు ఈ నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. అఫ్గానిస్తాన్, యెమెన్, భారత్, సోమాలియా దేశాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా 18 ఏళ్లు నిండకనే వివాహమవుతున్న బాలికల సంఖ్య 1.5 కోట్లు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రతి ముగ్గురిలో ఒకరికి 18 ఏళ్లు నిండకనే వివాహమవుతోంది. దీని వల్ల బాలికలు టీనేజ్‌లోనే గర్భం దాల్చడం, ప్రసూతి మరణాలు సంభవించడం, పాఠశాలకు దూరం కావాల్సి వస్తోందని నివేదిక పేర్కొంది. భారత్ విషయానికి వస్తే.. 2011 జనాభా లెక్కల ప్రకారం.. దేశంలో 30 శాతం మంది మహిళలు పద్దెనిమిదేళ్లు నిండకనే వివాహమైనవారే! 2001-11 మధ్య కాలంలో దేశంలో 1.5 కోట్ల మందికి చిన్న వయసులోనే వివాహమైంది.

 అభివృద్ధి చెందిన దేశాల్లోనూ...
 అభివృద్ధి చెందిన పలు దేశాల్లో కూడా బాలికల స్థితిగతులు అంత మెరుగ్గా ఏమీ లేవు. ఉదాహరణకు యూఎన్‌డీపీ మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)ప్రకారం ఆస్ట్రేలియా ర్యాంకు 2. అయితే ‘సేవ్ ది చిల్డ్రన్’ నివేదిక ప్రకారం ఆ దేశం  21వ స్థానంలో ఉంది. మహిళా ఎంపీల శాతం తక్కువగా ఉండడం, టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం అధికంగా ఉండడమే ఇందుకు కారణం. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా హెచ్‌డీఐ ర్యాంకు 32 కాగా, ఈ నివేదిక  ప్రకారం 32. అల్జీరియా, కజకిస్తాన్ దేశాల కంటే కూడా అమెరికా దిగువన ఉంది. మహిళా ఎంపీల సంఖ్య తక్కువగా ఉండడం, ప్రసూతి మరణాలు అధికంగా ఉండడమే అమెరికా ర్యాంకు తక్కువగా ఉండడానికి ప్రధాన కారణం.

 ప్రభుత్వ చర్యలు
 లింగ వివక్షను అంతం చేసేందుకు, బాలికా సంక్షేమం కోసం  2015 జనవరి 2న ప్రధాని నరేంద్ర మోదీ ‘బేటీ బచావో(కుమార్తెను కాపాడండి)- బేటీ పడావో(కుమార్తెను చదివించండి)’ అనే కార్యక్రమాన్ని  ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద బాలికలకు ఆర్థిక స్వావలంబన కల్పించే సుకన్య సమృద్ధి యోజన కార్యక్రమాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పదేళ్లలోపు ఈ పథకం కింద బ్యాంకుల్లో లేదా పోస్టాఫీసుల్లో కనీసం వెయ్యి రూపాయలతో ఖాతా ప్రారంభించవచ్చు. ఈ ఖాతాలో జమచేసే సొమ్ముపై 9.1 శాతం వడ్డీతో పాటు, ఆదాయ పన్ను రాయితీ లభిస్తుంది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువుల కోసం అందులోంచి సగం డబ్బు తీసుకోవచ్చు. బాల్య వివాహాలను అరికట్టేందుకు 18 ఏళ్ల వరకు విత్‌డ్రాయల్స్ అనుమతించరు.
 
 ‘ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. సరిహద్దు దేశాల కంటే మనం వెనుకబడి ఉండడం జీర్ణించుకోలేనిది. అయితే దేశంలో బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టడం శుభపరిణామం. దశాబ్దం కిందట బిహార్‌లో బాల్య వివాహాలు 60 శాతం ఉండగా, ప్రస్తుతం 39 శాతానికి తగ్గాయి’
    - థామస్ చాందీ, సేవ్  ది చిల్డ్రన్ ఇండియా సీఈవో
 
 1.5 కోట్లు -  ప్రపంచవ్యాప్తంగా 18 ఏళ్లలోపే వివాహమవుతున్న బాలికల సంఖ్య
 64% - రువాండాలో మహిళా ఎంపీల శాతం. ప్రపంచంలో ఇదే అత్యధికం. ప్రపంచ  వ్యాప్తంగా మహిళా ఎంపీల సగటు- 25%
 19% - అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 18 ఏళ్లు కూడా నిండకనే గర్భం దాల్చుతున్న బాలికల శాతం
 25 దేశాలు - ప్రకృతి విపత్తులు, అంతర్యుద్ధాలతో సతమతమవుతున్న 25 దేశాల్లోనే అధికంగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement