
పైసాచికం!
చిన్న మొత్తాల కోసమే ప్రాణాలు తీస్తున్నారు
బయటపడకూడదని చేసినవే ఎక్కువ
నేరగాళ్లలో విద్యాబుద్ధులు లేనివారే అత్యధికం
సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హష్మి హత్య సైతం ఇలానే
సిటీబ్యూరో: భారీ ఆస్తి/సొత్తు కోసం... వ్యక్తిగత కక్ష... భూ వివాదం... వివాహేతర సంబంధం... ఒకప్పుడు ఇవే హత్యలకు దారి తీసేవి. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చిన్న చిన్న మొత్తాల కోసమూ కిరాతకులు తెగిస్తున్నారు. ఏకంగా ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నారు. బుధవారం వెలుగులోకి వచ్చిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ హష్మీ హత్య ఈ కోవకు చెందినదే. అతడి నుంచి రూ.10 వేలు తీసుకోవడానికి ప్రయత్నించిన స్నేహితుడు నరేష్‌కుమార్‌రెడ్డి... అది సాధ్యం కాకపోవడంతో దారుణంగా హత్య చేశాడు.
ఓతప్పు కప్పిపుచ్చేందుకు ‘మరోటి’...
ఈ తరహా చిన్న మొత్తాల కోసం జరుగుతున్న హత్యల్లో అనేకం ఉనికి బయటపడకూడదనే చోటు చేసుకుంటున్నాయని పోలీసులు చెప్తున్నారు. నేరగాళ్లు తాము టార్గెట్ చేసుకున్న వ్యక్తుల నుంచి తొలుత డబ్బు మాత్రమే తీసుకోవాలని ఆశిస్తుంటారు. అయితే ఎదుటి వారి స్పందన ఆధారంగా దోపిడీకి తెగబడతారు. ఆపై బాధితుల ద్వారా విషయం బయటకు రాకుండా ఉండటం, పోలీసుల ఫిర్యాదులు తదితరాలు తప్పించుకోవాలని భావిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే బరితెగిస్తున్న నేరగాళ్లు ప్రాణాలు తీసే వరకు వెళ్తున్నారని దర్యాప్తు అధికారులు చెప్తున్నారు. టార్గెట్ చేసిన వ్యక్తులు పరిచయస్థులైతేనే ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోందని వివరిస్తున్నారు.
‘భవిష్యత్తు’ లేని వాళ్లే నేరగాళ్లు...
చిన్న మొత్తాల కోసమూ బరితెగించి హత్యల వరకు వెళ్తున్న నేరగాళ్ల సామాజిక, ఆర్థిక నేపథ్యమూ కీలకమైన అంశమని పోలీసులు చెప్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉంటున్న వారిలో నిరక్షరాస్యులు, సామాజిక హోదా లేని వాళ్లు, భవిష్యత్తుపై ఆలోచనలు లేని వాళ్లే ఎక్కువగాా ఉంటున్నారని స్పష్టం చేస్తున్నారు. వీరికి చదువు, ఉద్యోగం వంటివి లేకపోవడం, కుటుం బాలకూ దూరంగా ఉండటం, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే లక్ష్యాలకు దూరంగా ఉండటం, బయట ఉన్నా-జైల్లో ఉన్నా సామాజిక జీవితంలో మార్పుచేర్పులు లేకపోవడం తదితరాల వల్లే ఈ నేరగాళ్లు బరితెగిస్తున్నారని అంటున్నారు. హష్మీని హత్య చేసిన నరేష్‌కుమార్‌రెడ్డి విషయాన్నే తీసుకుంటే ఇతడు ఖమ్మం జిల్లా పాల్వంచకు చెందిన వాడు. చిన్నప్పటి నుంచి విద్యాబుద్ధులు సరిగ్గా అబ్బకపోవడంతో ఐటీఐతో సరిపెట్టాడు. ఎలక్ట్రీషియన్‌గా పని చేస్తూ నగరానికి చేరుకున్నాడు. చివరకు పనీ పాటా మానేసి అవారాగా మారాడు. చివరకు రూ.10 వేల కోసం హష్మీని హత్య చేసి హంతకుడిగా మారాని దర్యాప్తు అధికారులు వెల్లడించారు.
క్రైమ్ కేస్ స్టడీస్...
ఉప్పల్ బీరప్పగూడలో నివసించే కురుమ వెంకటేశ్వర్లు వృత్తిరీత్యా డ్రైవర్. ఇందిరానగర్‌లోని హిజ్రా వద్దకు వచ్చిన ఇతడు మద్యం తాగాడు. అదే ప్రాంతానికి వచ్చిన కావూరి బ్రహ్మం అనే యువకుడిని మద్యం తాగడానికి డబ్బు అడిగాడు. అతడు కాదనడంతో వెం టాడి మరీ బండరాయితో మోది చంపేశాడు.
కర్ణాటకకు చెందిన నెహామియా, జహీరాబాద్‌కు చెందిన అనిల్ నగరంలో ఫుట్‌పాత్‌లపై నివసిస్తూ చిన్నచిన్న పనులు చేసుకునేవారు. వీరిద్దరూ రెతిఫైల్ సమీపంలో జేబులో నగదుతో ఉన్న ఓ వ్యక్తిని వీరిద్దరూ చూశారు. దీంతో అతడికి మాయమాటలు చెప్పి చిలకలగూడలోని పాడుబడిన రైల్వే క్వార్టర్స్‌లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఆ వ్యక్తిని చంపేసిన ఇద్దరూ... రూ.5 వేలతో ఉడాయించారు.
బాలాపూర్‌కు చెందిన అంజయ్య కంచన్‌బాగ్ హఫీజ్‌బాబానగర్ నిర్వాసితులకు పాలు విక్రయించే వాడు. నిత్యం ఇతడి వద్దకు ఓ వ్యక్తి వచ్చి రూ.10 తీసుకునే వాడు. ఓరోజు ఆ నగదు ఇవ్వడానికి అంజయ్య నిరాకరించడంతో సదరు వ్యక్తి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేశాడు.