జంట హత్యలు | Double murder | Sakshi
Sakshi News home page

జంట హత్యలు

Oct 26 2015 1:28 AM | Updated on Sep 29 2018 4:52 PM

వివాహేతర సంబంధం నేపథ్యంలో దాచేపల్లి మండలంలో ఆదివారం జంట హత్యలు జరిగాయి.

దాచేపల్లి:  వివాహేతర సంబంధం నేపథ్యంలో దాచేపల్లి మండలంలో ఆదివారం జంట హత్యలు జరిగాయి. భార్య వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో ఆమెను, ఆమె ప్రియుడిని భర్త కత్తితో నరికి చంపడం సంచలనం కలిగించింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. దాచేపల్లి మండలం నడికుడి గ్రామానికి చెందిన అక్కినపల్లి హనుమయ్యకు రెంటచింతల గ్రామానికి చెందిన దివ్య(23)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. వ్యవసాయ పనులు చేసుకుని జీవించే వీరికి కుమారుడు మణికంఠ  ఉన్నాడు. తన ఇంటి ఎదురుగా ఉన్న వీధిలో నివసించే చెన్నబోయిన నాగేశ్వరరావు(32)తో దివ్య కొంతకాలంగా వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని హనుమయ్య అనుమానించాడు. ఈ విషయంపై పలుమార్లు పెద్దల సమక్షంలో భార్యభర్తలకు పంచాయితీ కూడా జరిగింది. దివ్యపై హనుమయ్యకు రోజురోజుకూ అనుమానం బలపడటంతో నాగేశ్వరరావును హతమార్చేందుకు కుట్రపన్నాడు. ఈ క్రమంలో గామాలపాడు పంచాయతీ పరిధిలోని సిక్కులదాబాలో నాగేశ్వరరావు ఉన్నట్లు హనుమయ్య సమాచారం తెలుసుకున్నాడు. కారంపూడి మండలం పేటసన్నెగళ్ల గ్రామానికి చెందిన సమీప బంధువు నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్రవాహనంపై సిక్కులదాబా వద్దకు వెళ్లారు. వెంట తెచ్చుకున్న కత్తితో నాగేశ్వరరావుపై దాడి చేశాడు. గొంతు, మెడ వద్ద కత్తితో కోయటంతో తీవ్ర రక్తస్రావం అయి నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు.

ఇంటి వద్ద భార్యను..
నాగేశ్వరరావు వద్ద ఉన్న సెల్‌ఫోన్‌ను తీసుకుని పరిశీలిస్తున్న క్రమంలో దివ్య సెల్‌ఫోన్ నుంచి కాల్‌వచ్చినట్లు హనుమయ్య గుర్తించాడు. దీంతో ఆగ్రహం పెంచుకున్న హనుమయ్య ద్విచక్రవాహనంపై నడికుడికి వచ్చి ఇంట్లో ఉన్న దివ్యపై  కత్తితో దాడిచేసి హతమార్చాడు. ఇంట్లో ఉన్న కుమారుడు మణికంఠను తన సమీప బంధువు నాగేశ్వరరావుకు ఇచ్చి పేటసన్నెగళ్లలోని తన బం ధువుల ఇంటికి పంపాడు. అనంతరం హనుమ య్య పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తన భార్య, ఆమె ప్రి యుడిని హత్యచేసినట్లు చెప్పి లొంగిపోయాడు. జంట హత్యల సమాచారం అందుకున్న గురజా ల సీఐ ఆళహరి శ్రీనివాసరావు వెంటనే దాబా లో, నడికుడిలో ఉన్న నాగేశ్వరరావు, దివ్య మృతదేహాలను పరిశీలించారు. స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. హత్యలకు సహకరించిన పేటసన్నెగళ్లకు చెందిన నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివాసరావు చెప్పారు.  పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాలను గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు నాగేశ్వరరావుకు భార్య లక్ష్మి ఉంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement