♦ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలి
♦ ఫోన్లు, ఎస్సెమ్మెస్ తదితర మార్గాల్లో జారీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పురస్కరించుకుని తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ విప్ జారీ చేసినట్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఎన్.అమర్‌నాథరెడ్డి తెలిపారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో పార్టీ ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డిలతో కలసి ఆయన మాట్లాడారు. తమ పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలందరికీ ఫోన్లు చేశామని, ఈ మెయిల్, ఎస్సెమ్మెస్, టెలిగ్రామ్ లాంటి అన్ని మార్గాలలో విప్ జారీ చేశామన్నారు. ప్రతి ఒక్కరూ చర్చలో పాల్గొనాలని, అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని కోరామన్నారు. సాధారణంగా అవిశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టిన రోజే దానిపై చర్చ జరగదని, అయితే అధికార పక్షం సోమవారమే దీనిపై చర్చ చేపట్టాలని నిర్ణయించడంతో విప్ జారీ చేసినట్లు తెలిపారు. విప్ ధిక్కరించిన వారిపై చర్యలు తీసుకుంటామని అమర్‌నాథరెడ్డి స్పష్టం చేశారు.
ప్రజలను వంచించారు..
అవిశ్వాస తీర్మానంపై బలవంతంగా చర్చ చేపట్టి అధికార పక్షం ప్రజలను వంచించిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన తర్వాత పది రోజుల్లో చర్చకు స్వీకరిస్తామని చెప్పి.. ఇప్పుడే చర్చ జరగాలనడం చాలా హేయమని, అయినప్పటికీ తాము చర్చలో పాల్గొంటామని చెప్పారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను దృష్టిలో ఉంచుకుని సభలో మెజారిటీ లేకపోయినా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించామని, కానీ టీడీపీ ప్రభుత్వం వారిని రక్షించడానికి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతోందని శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు.
బీఏసీ నిర్ణయం మేరకే..
అవిశ్వాస తీర్మానంపై సోమవారం చర్చించాలని అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులు చెప్పారు.
సభకు ఆ ఎనిమిది మంది గైర్హాజరు
వైఎస్సార్‌సీపీ తర ఫున ఎన్నికై ఇటీవల టీడీపీలో చేరిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభకు గైర్హాజరయ్యారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సోమవారమే చర్చకు అనుమతించిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యేలు శాసనసభకు రాకపోవడం చర్చనీయాంశమైంది.
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలకు విప్
Published Tue, Mar 15 2016 1:39 AM | Last Updated on Tue, Oct 30 2018 4:01 PM
Advertisement
Advertisement