స్వరాష్ట్రంలోనూ బానిసత్వమా? | Why people in Telangana can not officially celebrate independenceday in State | Sakshi
Sakshi News home page

స్వరాష్ట్రంలోనూ బానిసత్వమా?

Published Sat, Sep 2 2017 2:54 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

స్వరాష్ట్రంలోనూ బానిసత్వమా? - Sakshi

స్వరాష్ట్రంలోనూ బానిసత్వమా?

తెలంగాణ విమోచన యాత్ర ప్రారంభ సభలో లక్ష్మణ్‌
సాక్షి, హైదరాబాద్‌: స్వరాష్ట్రంలోనూ స్వాతం త్య్రదినోత్సవం అధికారికంగా జరుపుకోలేని బానిసత్వం తెలంగాణ ప్రజలకు ఎందుకని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ప్రశ్నించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టాలని కోరుతూ బీజేపీ చేపట్టిన విమోచన యాత్ర శుక్రవారం ఇక్కడ బాగ్‌లింగంపల్లిలోని ఆర్టీసీ కల్యాణమండపం వద్ద ప్రారంభమైంది. లక్ష్మణ్‌ మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి పొందిన సెప్టెంబర్‌ 17 తెలంగాణ ప్రజలకు అత్యంత పవిత్రమైన రోజు అని పేర్కొన్నారు.

విమోచన దినోత్సవం ప్రాముఖ్యత , సీఎం కేసీఆర్‌ ఎవరి కోసం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారో ప్రజలకు వివరిస్తామన్నారు. సెప్టెంబర్‌ 17న అధికారికంగా నిర్వహించకుంటే ప్రభుత్వాన్ని కూల్చేయాలని ఉద్యమ సమయంలో మాట్లాడిన కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకు మాట్లాడటం లేదో ప్రజలకు చెప్పాలని లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు పట్టిన గతే సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు పడుతుందని హెచ్చరించారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య త్యాగానికి కూడా కొందరు మతం రంగు పూస్తున్నారని అన్నారు.

బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు మజ్లిస్‌ మోచేతి నీళ్లు తాగాయని, ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కూడా అదే చేస్తున్నదని విమర్శించారు. తెలంగాణలో సెప్టెంబర్‌ 17 అధికారికంగా నిర్వహిస్తామని హామీని ఇచ్చిన సీఎం కేసీఆర్‌ మాట తప్పారని, ప్రజలు తిరగబడకముందే సీఎం కేసీఆర్‌ కళ్లు తెరవాలని సూచించారు. బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ముస్లింలకు బానిసగా మారారని విమర్శించారు.

కేసీఆర్‌ అంటే ఖాసీం చంద్రశేఖర్‌ రజ్వీ అని అభివర్ణించారు. అభినవ ఖాసీం రజ్వీ కేసీఆర్‌ పాలనను అంతమొందించాలని నాగం పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ ఎన్‌.రామచందర్‌రావు, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్, పార్టీ జాతీయ నాయకులు నల్లు ఇంద్రసేనారెడ్డి, పేరాల చంద్రశేఖర్‌రావు, పార్టీ నేతలు కె.దిలీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, కుమార్‌రావు, శ్రీధర్‌రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యాత్రను ప్రారంభించడానికి ముందుగా దుర్గామాతకు పూజలు చేశారు. నాంపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement