పోలీసుశాఖలో ‘ఆర్డర్లీ’ కలవరం!
- ఏడీజీ వ్యవహారంపై సర్వత్రా చర్చ
- ఢిల్లీ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ ఆరా
సాక్షి, నెట్‌వర్క్: పోలీసుశాఖలో కలవరం మొదలైంది. ఆర్డర్లీ వ్యవస్థ పేరిట జరుగుతున్న అరాచకాలపై కింది స్థాయి సిబ్బందిలో తీవ్ర చర్చ జరుగుతోంది. అదనపు డీజీపీ వ్యవహారంపై ఉన్నతాధికారులు సైతం ఆశ్చర్య పోయారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న డీజీపీ అనురాగ్ శర్మ ఈ వ్యవహారంపై ఆరా తీసినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. మొత్తం తతంగం మీద తనకు నివేదిక అందిం చాలని ఇంటెలిజెన్స్ అధికారులను డీజీపీ ఆదేశించినట్టు తెలిసింది. డిసెంబర్‌లో జరిగిన వ్యవహారం నుంచి కానిస్టేబుల్‌ను కొట్టిన ఘటన, ఇతరత్రా అంశాలపై సమగ్ర నివేదిక అందించాలని ఆదేశించినట్టు తెలియవచ్చింది.
సోమవారంలోగా నివేదికకు సీఎస్ ఆదేశం...
అదనపు డీజీపీ వ్యవహారంపై ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు సైతం ఆశ్చర్యం వ్యక్తంచేశాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపి సోమవారానికల్లా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఆదేశించారు.
సీసీ ఫుటేజీ పరిశీలన...
తమ వ్యవహారం బయటపడటంతో సంబంధిత అధికారి కార్యాలయం లీకేజీ చేసిన వారి గుర్తింపునకు కంకణం కట్టుకున్నట్టు తెలిసింది. మొత్తం డీజీపీ కార్యాలయానికి నిత్యం వచ్చి వెళ్లే వారి జాబితాపై దృష్టి సారించినట్టు సమాచారం. తమకు జరిగే అన్యాయాలు చెప్పుకోవడానికి వచ్చే బాధితులు మొదలుకొని వీఐపీలు, జర్నలిస్టులు, పోలీసు సిబ్బంది, అధికారులు.. ఇలా డీజీపీ ఆఫీసుకు వచ్చి వెళ్లే వారి సీసీ ఫుటేజీ కావాలని భద్రతాధికారులకు హుకుం జారీ చేసినట్టు తెలియవచ్చింది. తమ కార్యాలయానికి వచ్చి వెళ్లే వారే సమాచారం లీక్ చేశారని, వారిని గుర్తించి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేయాలనే యోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తమ అధికారి వ్యవహారం బయటపడటం జీర్ణించుకోలేని కార్యాలయ అధికారులు ఇలాంటి విపరీత ధోరణికి తెరదీశారని తెలిసింది.