భార్యే ప్రియుడితో హత్య చేయించింది | wife had killed with boyfriend | Sakshi
Sakshi News home page

భార్యే ప్రియుడితో హత్య చేయించింది

Published Sat, Aug 15 2015 5:39 AM | Last Updated on Mon, Jul 30 2018 8:41 PM

భార్యే ప్రియుడితో హత్య చేయించింది - Sakshi

భార్యే ప్రియుడితో హత్య చేయించింది

వీడిన మేస్త్రీ హత్య కేసు మిస్టరీ
 
నాగోలు: బండ్లగూడలో గతనెల 24 వెలుగు చూసిన మేస్త్రీ హత్య కేసును ఎల్బీనగర్ పోలీసులు ఛేదించారు. తమ ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భార్యే అతడిని ప్రియుడితో చంపించిందని తేల్చారు.  శుక్రవారం ఎల్బీనగర్ సీఐ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఏసీపీ వేణుగోపాల్‌రావు విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... ప్రకాశం జిల్లా కొండేటి మండలం సంతనూతలపాడు గ్రామానికి చెందిన తన్నీరు వెంకటేశ్ (35), సుశీల భార్యాభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.  వీరు బండ్లగూడ సర్వే నెం-58లో ఇల్లు కొనుగోలు చేసి ఉంటున్నారు.  మేస్త్రీగా పని చేసే వెంకటేశ్ తర్వాత సర్వే నెం-58లో కిరాణాషాపు పెట్టాడు. ఇదిలా ఉండగా.. గుంటూరు జిల్లా పెద్ద పులివేరుకు చెందిన గొర్రుమంచు కోటేశ్వరరావు (24) బండ్లగూడ ఆనంద్‌నగర్‌లో ఉంటున్నాడు.  వెంకటేశ్ మేస్త్రీగా కాంట్రాక్ట్ పట్టుకుని కోటేశ్వరరావుకు అప్పగించేవాడు. పనులకు సంబంధించి కోటేశ్వరరావుకు వెంకటేశ్ కొంతడబ్బు బాకీపడ్డాడు.  ఈ క్రమంలో తరచూ వెంకటేశ్ ఇంటికి వచ్చే కోటేశ్వరరావుకు అతని భార్య సుశీలతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది గమనించిన వెంకటేశ్ భార్యను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు.

 పథకం ప్రకారమే...
 తమ ఆనందానికి అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని, అది కూడా తాను ఇంట్లో లేనప్పుడు చేస్తే ఎలాంటి ఇబ్బందులు రావాలని సుశీల ప్రియుడు కోటేశ్వరరావుతో కలిసి పథకం వేసింది. ఈ క్రమంలోనే గతనెల 14న పిల్లలను తీసుకుని సొంతూరు సంతనూతలపాడుకు వెళ్లింది. 23వ తేదీ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వెంకటేశ్ తలపై పెద్ద కర్రతో మోది కోటేశ్వరరావు చంపేశాడు. తర్వాత  ప్రియురాలు సుశీలకు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాడు. తనకు ఏమీ తెలియనట్టు మరుసటి రోజు ఉదయం పిల్లలను తీసుకుని ఫతుల్లాగూడలోని ఇంటికి వచ్చిన సుశీల.. ఇంట్లో పడివున్న భర్త మృతదేహాన్ని చూసి ఎవరో హత్య చేశారంటూ బోరుమంది.  కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిందితుడు కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు.  అతడిని విచారించగా సుశీలను వేధించడంతో పాటు తనకు రావాల్సిన డబ్బు చెల్లించకపోవడంతో వెంకటేష్‌ను హత్య చేసినట్లు తెలిపాడు. దీంతో పోలీసులు.. హత్యకు పథకం పన్నిన సుశీలతో పాటు కోటేశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement