
వివాహేతర సంబంధం వద్దన్నాడని నిప్పు
* ప్రియుడితో కలిసి భార్య ఘాతుకం
* భర్త మరణవాగ్మూలంతో నిందితుల అరెస్టు
హైదరాబాద్: ప్రియుడితో కలిసి భర్త ప్రాణం తీసిన మహిళతో పాటు ఆమె ప్రియుడిని కార్ఖానా పోలీసులు సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివాహేతర సంబంధం వద్దన్నందుకు భార్య, ఆమె ప్రియుడు తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని భర్త ఇచ్చిన మరణవాగ్మూలం మేరకు నిందితులను కటకటాల్లోకి నెట్టారు.
సీఐ వై.నాగేశ్వరరావు అందించిన వివరాల ప్రకారం.... మెదక్ జిల్లా శివ్వంపేట గ్రామానికి చెందిన కృష్ణ (42), విజయ దంపతులు పొట్టకూటి కోసం ఏడేళ్ల క్రితం నగరానికి వచ్చి కార్ఖానాలోని విక్రంపురి కాలనీలో నివాసముంటున్నారు. భర్త అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పని చేస్తుండగా.. భార్య ఇళ్లలో పని చేసేది. అమర్‌నాథ్ అనే కారుడ్రైవర్‌తో కృష్ణకు స్నేహం ఏర్పడింది. అతను తరచూ కృష్ణ ఇంటికి వచ్చేవాడు. ఈ క్రమంలో విజయతో విహేతరసంబంధం పెట్టుకున్నాడు.
ఈ విషయం తెలిసి కృష్ణ గతేడాది పంచాయితీ పెట్టగా పెద్దమనుషులు విజయ, అమర్‌నాథ్‌లను మందలించారు. అయినా వారు పద్ధతి మార్చుకోలేదు. దీంతో గతేడాది మార్చి 21న కృష్ణ భార్యను నిలదీయగా గొడవ జరిగింది. కృష్ణ ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అతడిని గాంధీకి తరలించారు.
తన భార్య విజయ, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అమర్‌నాథ్ కలిసి తనపై కిరోసిన్ పోసి నిప్పంటించారని బాధితుడు కృష్ణ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడు. చికిత్సపొందుతూ రెండు రోజులకే అతను మృతి చెందాడు. మృతుడు కృష్ణ ఇచ్చిన వాగ్మూలం మేరకు కేసు నమోదు చేసి విచారణ జరిపిన పోలీసులు నిందితులు విజయ, అమర్‌నాథ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.