భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
హైదరాబాద్: ప్రేమించి.. పెద్దలను ఒప్పించి.. పెళ్లి చేసుకుని వదిలించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఓ యువతి భర్త ఇంటి ముందే ఆందోళనకు దిగిన ఘటన ఆదివారం చంపాపేటలో చోటుచేసుకుంది. వివరాలు.. చంపాపేట మారుతీనగర్ రోడ్డు నెం.13లో నివసించే కుతడి వెంకటేష్ జహీరాబాద్‌లోని ట్రాన్స్‌కో కార్యాలయంలో ఏడీఇగా విధులు నిర్వర్తిస్తున్నాడు. 2005లో మెహిదీపట్నం విద్యుత్ సబ్‌స్టేషన్‌లో వెంకటేష్ సబ్ ఇంజినీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సమయలో అదే కార్యాలయంలో పనిచేసే మల్లీశ్వరితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది.
2011 ఆగస్ట్‌లో కోఠిలోని ఆర్య సమాజ్‌లో వివాహం చేసుకొని కవాడీగూడలోని ఓ కాలనీలో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అక్కడి నుంచి 2013లో గాంధీనగర్‌కు ఇంటిని మార్చారు. ఈ క్రమంలోనే మల్లీశ్వరికి రెండుసార్లు అబార్షన్ చేయించాడు. కొంతకాలంగా భార్యను నిర్లక్ష్యం చేయడమే కాకుండా అప్పడప్పుడు మాత్రమే ఆమె ఉండే ఇంటికి వచ్చేవాడు. దీంతో మల్లేశ్వరి 2015లో కంచన్‌భాగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫలితం లేకపోవడంతో ఆదివారం భర్త ఇంటి ఎదుటే ఆందోళనకు దిగింది.