![Wife Protest Infront Of Husband House In Guntur - Sakshi](/styles/webp/s3/article_images/2018/07/17/wife-protest.jpg.webp?itok=JUU5_I8_)
భర్త ఇంటి ముందు బైఠాయించిన ఈశ్వరమ్మ
దాచేపల్లి(గురజాల): కాపురానికి తీసుకువెళ్లాలంటూ భర్త ఇంటి ముందు భార్య బైఠాయించిన ఘటన దాచేపల్లి మండలం కేసానుపల్లిలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన గుదె వెంకటేశ్వర్లు ఇంటి ముందు ఆయన భార్య ఈశ్వరమ్మ ఆదివారం రాత్రి 10 గంటల నుంచి బైఠాయించారు. ఇరవై ఏళ్ల కిందట కేసానుపల్లికి చెందిన వెంకటేశ్వర్లుతో ఆమెకు వివాహమైంది. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో రెండేళ్ల నుంచి ఈశ్వరమ్మ తండ్రి వద్ద ఉంటోంది. పలుమార్లు భార్యాభర్తల మధ్య రాజీ కోసం పంచాయితీలు కూడా జరిగాయి. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తనకు భర్త, పిల్లలు కావాలంటూ ఈశ్వరమ్మ భర్త ఇంటి వద్దకు వచ్చింది.
లోపలకు వచ్చేందుకు భర్తతో పాటు కుటుంబసభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటి ముందు బైఠాయించింది. విషయం తెలుసుకున్న మహిళా సంఘాల నాయకురాలు లంకె శాంతితో పాటు పలువురు ఈశ్వరమ్మకు సంఘీభావం తెలిపారు. ఈశ్వరమ్మను కాపురానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. తనను ఇంట్లోకి వెళ్లేందుకు భర్తతో పాటు అత్తమామలు అడ్డుకుంటున్నారని, పిల్లల నుంచి తనను వేరు చేయాలని చూస్తున్నారని ఈశ్వరమ్మ ఆరోపించింది. దీనిపై భర్త వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తనపై ఈశ్వరమ్మ పెట్టిన కేసులపై కోర్టులో విచారణ జరుగుతోందని, తేలిన తరువాత దీనిపై మాట్లాడతానని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment