ముషీరాబాద్: న్యాయం చేయాలని కోరుతూ ఓ మహిళ భర్త ఇంటి ఎదుట బైటాయించిన సంఘటన ముషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీలో మంగళవారం చోటుచేసుకుంది. బాధితురాలు, ఇన్‌స్పెక్టర్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పాతబస్తీ అలియాబాద్‌కు చెందిన శంకర్, యమున దంపతుల కుమార్తె స్వప్న (హాస్య)కు రాంనగర్ ఈస్ట్ ఎంసీహెచ్ కాలనీకి చెందిన వెంకటేష్, అనసూయల కుమారుడు విజయ్‌కుమార్‌తో 2015 లో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో రూ. 5లక్షలు కట్నం ఇచ్చారు.
రెండు నెలల్లోనే విజయకుమార్ తరచూ భార్యను వేధించేవాడు. అయినా ఏడాది పాటు అక్కడే ఉన్నట్లు స్వప్న తెలిపింది. పద్మారావునగర్‌లో వేరు కాపురం పెట్టించినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదని తెలిపింది. బెంగళూరులో ఉద్యోగం వచ్చిందని చెప్పి తనను పుట్టింటికి పంపించాడన్నారు. అయితే ఉద్యోగం చేయకపోగా తనను మళ్లీ కాపురానికి తీసుకెళ్లలేదని, దీంతో ఝాన్సీ బజార్ మహిళా పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేయగా కౌన్సెలింగ్ కూడా ఇచ్చినట్లు తెలిపింది. అయితే తనకు తెలియకుండానే విడాకులకు దరఖాస్తు చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో లీగల్ అథారిటీ వాలంటీర్ పద్మ, గీతలతో కలిసి సోమవారం రాత్రి అత్తగారింటికి రాగా, ఆమె రాకను గమనించి అత్తామామ, బావ ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇంటిముందే బైటాయించింది. ముషీరాబాద్ ఎస్‌ఐ సాయికుమార్ బాధితురాలితో పాటు, ఆమె భర్తను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి చర్చించారు. తనకు భర్తే కావాలని స్వప్న కోరుతుండగా, తనకు వద్దని విజయ్‌కుమార్ చెప్పినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment