సాక్షి, హైదరాబాద్ : గుట్కా, పాన్ మసాలా నిషేధం కొత్త మలుపు తిరుగుతోంది. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో గుట్కా నిషేధం రాజకీయ రంగు పులుముకుంటోంది. గుట్కాలపై రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా నిషేధం ఉన్న విషయం తెలిసిందే. ఈ నిషేధాన్ని అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా జనవరిలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తోంది.
అయితే నిషేధం ముగిసే సమయం దగ్గర పడుతున్న తరుణంలో గుట్కా విక్రయాలపై నిషేధం ఎత్తేయాలని కోరుతూ ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై ప్రస్తుత పరిస్థితి తెలపాలంటూ రాష్ట్ర ఫుడ్ సేఫ్టీ కమిషనర్ (వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి)ను ప్రభుత్వం ఆదేశించింది.
దీంతో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. అందులో గుట్కా, పాన్ మసాలా ఉత్పత్తులతో కేన్సర్ రోగులు బాగా పెరుగుతున్నారని, నిషేధం కొనసాగించాలని సూచించినట్లు తెలిసింది. ఇప్పుడు ఈ నివేదిక ఆసక్తికరంగా మారింది. సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
పొగాకు ఉత్పత్తులపైనా నిషేధం..
నోటి కేన్సర్ బాధితులు బాగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర మార్గదర్శకాలకు అనుగు ణంగా ఉమ్మడి ఏపీ ప్రభుత్వం 2013 జనవరి 9న గుట్కా ఉత్పత్తులను నిషేధించింది. ఏటా నిషేధం కొనసాగించేలా గెజిట్ జారీ చేసింది. అయితే గుట్కాను మాత్రమే నిషేధించడంతో పొగాకుతో తయారయ్యే పాన్‌మసాలా ఉత్పత్తులు మార్కెట్‌లో బాగా పెరిగాయి.
ఆ తర్వాత 2014 జనవరి 9న ప్రభుత్వం సమగ్రంగా ఆదేశాలు ఇచ్చింది. నికోటిన్, పొగాకు ఆనవాళ్లు ఉండి నోటి ద్వారా తీసుకునే అన్ని ఉత్పత్తులపైనా నిషేధం విధించింది. చాప్ టొబాకో, ప్యూర్ టొబాకో, ఖైనీ, ఖారా, పొగాకు ముక్కలు, పొగాకు ఆనవాళ్లు ఉండేవన్నీ నిషేధిత జాబితాలో ఉంటాయని వివరణ ఇచ్చింది. ఏటా జనవరి 9న నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణలోనూ ప్రభుత్వం ఇవే ఆదేశాలను అమలు చేస్తోంది.
గతేడాది జనవరి 10న నోటి ద్వారా తీసుకునే అన్ని రకాల నికోటిన్, పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధించింది. అప్పటి ఫుడ్ సేఫ్టీ కమిషనర్ రాజేశ్వర్ తివారీ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. తాజాగా నిషేధం ఎత్తివేత విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి రావడంతో మళ్లీ ఈ అంశం తెరపైకి వచ్చింది. ఇదే సమయంలో రాజేశ్వర్ తివారీ వైద్య, ఆరోగ్య శాఖ నుంచి రెవెన్యూ శాఖకు బదిలీ కావడం మరో మలుపు.
48 శాతం మంది నమిలేస్తున్నారు..
పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల వినియోగంతో అధిక శాతం మంది నోటి కేన్సర్ బారినపడుతున్నారు. 2009–10 ప్రపంచ పొగాకు ఉత్పత్తుల సర్వే ప్రకారం 53.5 శాతం మంది పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు వినియోగిస్తున్నట్లు తేలింది.
గుట్కా, పాన్ మసాలాను నమిలే వారు 48.07 శాతం మంది ఉన్నారని ఈ సర్వేలో తేలింది. వీరిలో పిల్లలు 16 శాతం వరకు ఉన్నారని అంచనా. నోటి కేన్సర్ బాధితులు ఏటా పెరుగుతుండటంతో దేశవ్యాప్తంగా గుట్కా, పాన్ మసాలాను నిషేధించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం–2011 ప్రకారం ఈ ఉత్పత్తులపై 2012 ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రాలు నిషేధించడం మొదలుపెట్టాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నిషేధం అమల్లో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment