
నిందితుడిని పట్టించిన 'గబ్బర్‌సింగ్'
ఆటోలో ప్రయాణికురాలు మర్చిపోయిన నగలు, నగదుతో ఉడాయించిన ఆటో డ్రైవర్‌ను ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. సొత్తు స్వాధీనం చేసుకుని నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఎల్బీనగర్ ఠాణాలో ఏసీపీ వేణుగోపాలరావు, సీఐ కాశిరెడ్డితో కలిసి డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ తెలిపిన వివరాల ప్రకారం... ఆర్‌కేపురం వాసవి కాలనీ నివాసి జి.మాధవి గతనెల 11న నల్లగొండ వెళ్లేందుకు ఆర్‌కే పురం నుంచి ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు వరకు ఆటోలో ప్రయాణించారు. 30 తులాల నగలు, రూ. 25 వేల నగదు ఉన్న బ్యాగ్‌ను ఆటోలో మర్చిపోయారు. బస్ ఎక్కి ఆటోనగర్ వరకు వెళ్లిన తరువాత బ్యాగ్ కనిపించకపోవడంతో వెంటనే వెనక్కి వచ్చి చూడగా ఆటో కనిపించలేదు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆటో లోపల గబ్బర్‌సింగ్ అని పేరు రాసి ఉందని బాధితురాలు చెప్పింది. ఆ ఆధారంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు ఆటో నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం జనగాం పల్లగుట్ట తండాకు చెందిన కళావత్ బోజ్యా(32)దిగా గుర్తించారు. నగలను విక్రయించేందుకు అతను ఎల్బీనగర్‌లోని ఓ నగల దుకాణానికి రాగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో అతడి వద్ద నుంచి ప్రయాణికురాలికి చెందిన 30 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్ చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.