
కలకత్తా: పశ్చిమబెంగాల్ రాజధాని కలకత్తా నుంచి బాగ్డోరా వెళుతున్న స్పైస్‌జెట్ విమానంలో తోటి మహిళా ప్రయాణికురాలితో ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ మేరకు ఎయిర్‌లైన్స్ ఆదివారం(ఫిబ్రవరి 4) ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జనవరి 31నాడు జరిగినట్లు ఎయిర్‌లైన్స్ వెల్లడించింది.
పక్క సీట్లో కూర్చున్న వ్యక్తి తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేసిన వెంటనే అతని సీటు మార్చినట్లు ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు. అయితే తాను అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ వ్యక్తి సిబ్బందికి స్పష్టం చేశాడు.
‘విమానం బాగ్డోరాలో ల్యాండ్ అయిన వెంటనే ఇద్దరు ప్రయాణికులను సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది వద్దకు తీసుకెళ్లాం. తనకు క్షమాపణలు చెప్పాలని మహిళా ప్రయాణికురాలు ఆ వ్యక్తిని కోరింది. అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి క్షమాపణలు చెప్పాడు. దీంతో ఆ మహిళా ప్రయాణికురాలు ఎలాంటి రాతపూర్వక ఫిర్యాదు చేయకుండానే వెళ్లిపోయింది’ అని ఎయిర్‌లైన్స్ సిబ్బంది తెలిపారు.
గడిచిన కొన్ని నెలల్లో విమానాల్లో ఇలాంటి పలు సంఘటనలు నమోదయ్యాయి. న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఒక వ్యక్తి వయసులో పెద్దదైన మహిళపై మూత్ర విసర్జన చేశాడని కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేశారు. నెల జైలు తర్వాత అతడికి బెయిల్ వచ్చింది.