దగాపడ్డ చెల్లెమ్మ | woman security TDP two years rule | Sakshi
Sakshi News home page

దగాపడ్డ చెల్లెమ్మ

Published Tue, Mar 8 2016 4:04 PM | Last Updated on Sat, Aug 11 2018 4:03 PM

woman security TDP two years rule

రెండేళ్ల టీడీపీ పాలనలో మగువలకు రక్షణ కరువు

  • నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
  • ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీనైనా అమలు చేయని ప్రభుత్వం
  • మహిళలపై కొనసాగుతున్న రాక్షసకాండ  
  • తహసీల్దార్‌ను దుర్భాషలాడి ఈడ్చిపడేసిన టీడీపీ ఎమ్మెల్యే
  • రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైనవారికి ప్రభుత్వ పెద్దల అండ
  • కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అన్న సీఎం
  • యువతులకు ముద్దయినా పెట్టాలి, కడుపైనా చేయాలన్న బాలకృష్ణ
  • తలవంపులు తెచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
  • ఉపాధ్యాయురాలి పట్ల మంత్రి తనయుడి అసభ్య ప్రవర్తన
  • అంగన్‌వాడీలు, ఆయాలపై లాఠీల కరాళ నృత్యం
  • ప్రేమోన్మాదుల దాడుల్లో బలైపోతున్న యువతులు

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళామణులు దగాపడ్డారు. ఎన్నికల్లో వారికి ఇచ్చిన ఒక్క హామీని కూడా టీడీపీ ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. సాక్షాత్తూ ప్రభుత్వమే వారిని వంచిస్తోంది. ‘‘మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వావలంబన కల్పించే దిశగా మహిళా సాధికారత ఉద్యమాన్ని తదుపరి స్థాయికి పార్టీ తీసుకెళుతుంది’’ అని టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పిస్తామని ప్రకటించారు.

మగువలకు సాధికారత, స్వావలంబన కల్పించే మాట అటుంచితే, మెజిస్టీరియల్ అధికారాలున్న తహసీల్దార్ స్థాయి అధికారినే దుర్భాషలాడి, ఈడ్చిపడేసిన రాక్షస ఘటన టీడీపీ పాలనలో చోటుచేసుకుంది. తహసీల్దార్ వనజాక్షిపై సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే దౌర్జన్యం చేసి, తీవ్రంగా అవమానించినా.. ప్రభుత్వం అతడిపై చర్యలు తీసుకునేందుకు సాహసించలేకపోయింది. పైగా వనజాక్షిదే తప్పు అంటూ ముఖ్యమంత్రే ఈ దౌర్జన్యకాండకు వత్తాసు పలకడం గమనార్హం. వనజాక్షి చేసిన తప్పంతా ఒక్కటే.. అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక దోపిడీని అడ్డుకోవడం.

తహసీల్దార్ పరిస్థితే ఇలా ఉంటే.. రాష్ట్రంలో సామాన్య మహిళల భద్రతకు భరోసా ఎక్కడుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాష్ట్రంలో మహిళల పట్ల ఎన్నో దారుణాలు చోటుచేసుకున్నాయి. నిందితులకు ప్రభుత్వ పెద్దలే అండగా నిలుస్తుండడంతో బాధితులకు న్యాయం ఎండమావిగానే మారుతోంది. మరోవైపు అధికార పార్టీ నేతలు మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తూ వెకిలిగా మాట్లాడుతుండడం గమనార్హం.


* నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య.. సర్కారు చేసిన హత్యేనని రాష్ట్రంలోని ప్రజా సంఘాలు నినదించాయి. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారకులైన వారికి ప్రభుత్వ పెద్దలు అండగా నిలవడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. విద్యార్థిని మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విపక్ష వైఎస్సార్‌సీపీ శాసనసభలో గళమెత్తినా.. ప్రభుత్వం ఎదురుదాడికే పరిమితమైంది.  

* ‘‘కోడలు మగపిల్లాడిని కంటానంటే ఏ అత్త మాత్రం వద్దంటుంది’’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను గమనిస్తే మహిళలపై ఆయనకున్న గౌరవం ఏపాటిదో ఇట్టే అర్థమవుతుంది.

* ‘‘యువతులు దగ్గరికి వస్తే ముద్దయినా పెట్టుకోవాలి, కడుపైనా చేయాలి. నేను ఎక్కని ఎత్తులు లేవు, చూడని లోతులు లేవు. మహిళలను గిల్లడాలు, పొడవడాలు నాకు మామూలే’’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ప్రజల్లో వ్యతిరేకత, నిరసన వ్యక్తమయ్యా యి. ఎమ్మెల్యేగా కొనసాగే అర్హత బాలకృష్ణకు లేదంటూ నెటిజన్లు గళమెత్తా రు. ‘‘ఎమ్మెల్యేగా సరే.. ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా మాట్లాడాల్సిన మాటలా అవి? ఇలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా కొనసాగించడానికి సర్కారుకు సిగ్గుండాలి’’ అని సోష ల్ మీడియాలో మండిపడుతున్నారు.

* మంత్రి రావెల కిశోర్‌బాబు తనయుడు రావెల సుశీల్ మైనారిటీ వర్గానికి చెందిన ఉపాధ్యాయురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం సంచలనం సృష్టించింది.
 
* తమ వేతనాలు పెంచాలని అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తే.. ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు రాక్షసంగా లాఠీఛార్జీ చేశారు. మహిళలను మగ పోలీసులు ఈడ్చిపడేశారు. ఇదేనా మహిళలకు ప్రభుత్వం ఇచ్చే మర్యాద? న్యాయమైన డిమాండ్ సాధనకు ప్రజాస్వామ్యయుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలపై అంత కక్ష ఎందుకు? అంటూ ప్రజలు సంధించిన ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.

* రాష్ట్రంలో యువతులపై దారుణాలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రేమోన్మాదుల చేతుల్లో ఎందరో బలైపోతున్నా  ప్రభుత్వం చోద్యం చూస్తోంది.
 
హామీలను గాలికొదిలేశారు
‘మహిళా సాధికారత, భద్రత’ పేరిట టీడీపీ ఎన్నికల ప్రణాళికలో రెండు పేజీలు కేటాయించారు. అందులో పేర్కొన్న ఒక్క హామీనైనా ప్రభుత్వం రెండేళ్ల పాలనలో నెరవేర్చలేకపోయింది. ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీలు, ప్రస్తుత పరిస్థితి ఏమిటో పరిశీలిద్దాం....

హామీ 1: బెల్టు షాపులు రద్దు చేస్తూ రెండో సంతకం
ప్రస్తుత పరిస్థితి: సంతకమైతే చేశారు.. అమలును మరిచారు. ఇప్పటికీ వాడవాడలా బెల్టు షాపులు నిక్షేపంగా కొనసాగుతున్నాయి. ప్రజల జీవితాలను గుల్ల చేస్తూనే ఉన్నాయి. మహిళల మంగళసూత్రాలను తెంపేస్తున్నాయి. వారి సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి.

హామీ 2: డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తాం
ప్రస్తుత పరిస్థితి: ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదు. కేవలం పెట్టుబడి నిధి అంటూ మాట మార్చారు.

హామీ 3: పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరిట ‘మహాలక్ష్మి పథకం’ కింద రూ.30 వేలు బ్యాంకులో వేసి, యుక్త వయసు వచ్చేసరికి రూ.2 లక్షలు అందిస్తాం
ప్రస్తుత స్థితి: ఒక్క ఆడబిడ్డ పేరిట కూడా కొత్తగా ఒక్క పైసా అయినా బ్యాంకులో జమ చేయలేదు.

 హామీ 4: ‘పండంటి బిడ్డ’ పథకం కింద పేద గర్భిణిలకు పౌష్టికాహారం కోసం రూ.10 వేలు ఇస్తాం
 ప్రస్తుత పరిస్థితి: గర్భిణిలకు ఒక్కపైసా కూడా ఇవ్వలేదు.

 హామీ 5: పేద మహిళలకు స్మార్ట్‌ఫోన్లు ఉచితంగా ఇస్తాం. హైస్కూల్/ఇంటర్ విద్యార్థినులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తాం
 ప్రస్తుత పరిస్థితి: మహిళలకు ఫోన్లు, విద్యార్థినులకు సైకిళ్ల జాడేలేదు.  

 హామీ 6: మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాం
 ప్రస్తుత పరిస్థితి: ఫోర్స్ ఏర్పాటు కాదు కదా.. ఒక్క మహిళా కానిస్టేబుల్ పోస్టును కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు.

హామీ 7: ప్రమాదంలో ఉన్న మహిళల రక్షణకు జీపీఎస్ టెక్నాలజీ సాయంతో సెల్‌ఫోన్ ద్వారా పోలీస్‌స్టేషన్లలోని అలారాన్ని అనుసంధానించి, 5 నిమిషాల వ్యవధిలో సహాయం అందించగల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం
ప్రస్తుత పరిస్థితి: ఇప్పటిదాకా ఇలాంటి ప్రయత్నమే జరగలేదు. 5 నిమిషాలు కాదు కదా.. 5 రోజులైనా మహిళలకు సహాయం అందే పరిస్థితి లేదు.

హామీ 8: మహిళా చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి మహిళా కమిషన్ కార్యదర్శిగా ఐపీఎస్ అధికారిని నియమిస్తాం
ప్రస్తుత పరిస్థితి: ఐపీఎస్ అధికారి నియమించడం ముఖ్యమంత్రికి క్షణంలో పని. కానీ, రెండేళ్లు పూర్తయినా నియామకం జరగలేదు.
 
మహిళా ఉద్యోగులనూ వంచించారు
ముఖ్యమంత్రి చంద్రబాబు మహిళా ఉద్యోగులను కూడా వంచించారు. పదో పీఆర్సీ నివేదికను అమలు చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు రెండేళ్లపాటు పిల్లల సంరక్షణ సెలవు ఇవ్వాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు అమలుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు శూన్యం. రెండు నెలలపాటు పిల్లల సంరక్షణ సెలవు మంజూరు చేస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. ఇంత మోసమా? అని మహిళా ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలోనైనా.. మహిళలకు ఇచ్చిన అన్ని హామీల అమలుపై ప్రభుత్వం దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement