మాటలుండవు ‘చేతలే’!
స్నాచింగ్ సమయంలో తెలివిగా వ్యవహరించే గ్యాంగ్
షామ్లీ జిల్లాలో 12 గ్రామాల్లో నివసిస్తున్న బవరియాలు
సోని పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయం
సిటీబ్యూరో: చిరునామా చెప్పమని అడుగుతూనో... మంచి నీళ్లు కావాలనో.. దుకాణంలో సరుకులు కావాలంటూ నో... ఇలా ఏదో ఒక రకంగా బాధితులతో మాటలు కలిపి గొలుసు దొంగతనాలు చేయడం స్నాచర్ల నైజం. అయితే నగరంపై విరుచుకుపడి మూడు రోజుల్లో 14 నేరాలు చేసిన బవరియా గ్యాంగ్ స్టైలే వేరు టార్గెట్ చేసుకున్న మహిళలతో అసలు మాట్లాడరు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన సోను ఈ ముఠాకు చెందిన సభ్యడన్న విషయం విదితమే. ఈ గ్యాంగ్ లీడర్ మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ సహా మరికొందరి కోసం జంట కమిషనరేట్ల అధికారులు వేట కొనసాగిస్తున్నారు.
ఒక చోట మాత్రమే డైలాగ్స్...
గత నెల 13, 14, 15 తేదీల్లో జంట కమిషనరేట్ల పరిధిలోని 14 ప్రాంతాల్లో పంజా విసిరిన ఈ ముఠా సభ్యులు కేవలం ఒక్క చోటే బాధితురాలితో మాట కలిపారు. మిగిలిన 13 ఉందంతాల్లోనే సంజ్ఞలతోనే ‘పని’ పూర్తి చేసుకుపోయారు. రెండు బృందాలుగా వేర్వేరు వాహనాలపై బయలుదేరే మంగళ్ గ్యాంగ్ ‘పెలైట్’, ‘హిట్’ పంథాలో రెచ్చిపోతుంది. నగరంలో పంజా విసిరిన మూడు రోజుల్లో టార్గెట్‌గా చేసుకున్న ఓ మహిళ వద్దకు వెళ్లిన ముఠా సభ్యుడు సమీపంలో ఉన్న చెట్టు వైపు చెయ్యెత్తి చూపించాడు. అక్కడ ఏముందా అని ఆ మహి ళ అటు చూడగా... గొలుసు లాక్కుని బైక్ ఎక్కి పారిపోయాడు. మరో ఉదంతంలో మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చి అరుగుపై కూర్చున్న మహిళ వద్దకు వెళ్లిన గ్యాంగ్ మెంబర్ ఆమె సమీపంలో నేలపై రాయడం మొదలెట్టాడు. అదేంటో చూద్దామని ఆ మహిళ కిందికి వంగగా... మెడలోని పుస్తెల తాడు లాక్కొని ఉడాయిం చాడు. మిగిలిన నేరాలనూ ఇలానే చేసిందీ బవరియా గ్యాంగ్.
భాషతో ప్రాంతం తెలుస్తుందని...
ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని 12 గ్రామాల్లో బవరియా తెగవారు నివసిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో చైన్ స్నాచింగ్స్‌తో పాటు ఇతర నేరాలు చేయడమే వీరి వృత్తి. బడాకాన్పూర్, జఠాన్‌పూర్, రామ్‌పుర, సూక్రా, నవబస్, ధూద్దీ, మసద్‌ఘడ్, ఛోటా కాన్పూర్, బైరాహియాం, హ్మద్‌ఘడ్, ఖేడీ, లాధీపూర్‌ల్లో ఈ తెగ విస్తరించి ఉంది. నాగరికత ఆనవాళ్లు పూర్తిగా కనిపించని ఆ గ్రా మాల్లోని యువత ఎప్పటికప్పుడు వేర్వేరు ముఠాలు కడుతూ నేరాలు చేయడమే వృత్తిగా చేసుకున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా నేరాలు చేసే వీరు బాధితులతో మాట్లాడితే... తమ భాష, యాస ఆధారంగా తాము ఏ ప్రాంతం వారిమో అనేది పోలీసులు పసిగట్టి పట్టుకుం టారనే భయంతో దొంగలు సాధ్యమైనంత వరకు మా టలకు దూరంగా ఉండి ‘చేతల’తో రెచ్చిపోతుంటారు.
స్థానికంగా ఏ నేరాలు చేయరు...
ఎంపిక చేసిన నగరాల్లో ఇళ్ల అద్దెకు తీసుకుని డెన్లు ఏర్పాటు చేసుకుంటూ రోజుల తరబడి మకాం వేసి మరీ పంజా విసురుతాయి బవరియా ముఠాలు. తమ సొంత ప్రాంతంలో మాత్రం ఎలాంటి నేరాలు చేయవు. దీనికితోడు స్థానిక పోలీసులతో వీరికి ‘ములాఖత్’ ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి పోలీసులు వస్తే ఆ విషయాన్ని అక్కడి పోలీసులే బవరియాలకు చేరవేస్తారు. ఇలా చేసినందుకు వారికి భారీ ‘పారితోషికాలే’ ముడతాయట. బవరియాలు నివసించే 12 గ్రామాలూ పక్కపక్కనే ఉండటంతో ఓ గ్రామంలోని వారికి విషయం తెలిస్తే చాలు.. చాలా తేలిగ్గా మిగిలిన వారికీ పాకి అందరూ అప్రతమత్తం అవుతారు. అలాగని స్థానిక పోలీసుల సహకారం లేకుండా బయటి పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే వారిపై దాడులకూ వెనుకాడరు.
ఒకే ఒక్కడు నుంచి ముఠాలుగా...
షామ్లీ జిల్లాలోని బవరియా తెగకు ఒకప్పుడు ఛత్రసేన అనే వ్యక్తి నాయకుడిగా ఉండేవాడు. ఇతడే పదుల సంఖ్యలో ముఠాలు నిర్వహిస్తూ నేరాలు చేయించేవాడు. దేశ వ్యాప్తంగా నేరాలు ఇతడి నేతృత్వంలోనే జరిగేవి. కాలక్రమంలో ఎవరికి వారు ముఠాలు ఏర్పాటు చేసుకుని రెచ్చిపోవడం ప్రారంభించడంతో మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ లాంటి వాళ్లు పెరిగిపోయారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మన్‌ప్రీత్ ఇల్లు బడా కాన్పూర్‌లో పెద్ద కోటను తలపిస్తూ గేటులతో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో నేరాలు చేయడానికి వెళ్లినా.. ముఠా సభ్యులకు అవసరమైన అన్ని ఖర్చులూ అతడే భరిస్తాడు. నివాసం, ఆహారం, ఇతర ఖర్చులు మాత్రమే కాదు... ఎవరైనా పోలీసులకు చిక్కితే బెయిల్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. ఈ నేపథ్యంలోనే చోరీ సొత్తులో అధిక మొత్తం అతడే తీసుకుంటాడు. ముఠా సభ్యులకు మాత్రం సొత్తు విలువను బట్టి ఒక్కో చోరీకి రూ.10 నుంచి రూ.15 వేల చొప్పున ఇస్తాడని పోలీసులు చెప్తున్నారు. గురువారం అరెస్టు చేసిన సోనును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న తర్వాత నగర పోలీసులు మరోసారి షామ్లీకి వెళ్లాలని నిర్ణయించారు.