chain robberies
-
చెలరేగిన దొంగలు
జిల్లాలో దొంగలు చెలరేగారు. ఆదివారం రాత్రి చింతలపూడి మండలంలో వరుస చోరీలకు పాల్పడ్డారు. సుమారు రూ.లక్ష నగదు, వెండి, బంగారు ఆభరణాలు, ఓ ద్విచక్రవాహనం అపహరణకు గురయ్యాయి. ఏలూరులో తాళం వేసి ఉన్న ఓ ఇంటిలోనూ దొంగలు పడ్డారు. బంగారం, వెండి వస్తువులు అపహరించారు. చింతలపూడి : మండలంలోని రాఘవాపురం, పట్టాయిగూడెం గ్రామాల్లో సోమవారం తెల్లవారు జామున వరుస చోరీలు జరిగాయి. ఫలితంగా స్థానికులు హడలెత్తిపోయారు. రాఘవాపురం గ్రామంలోని చిన్నంశెట్టి సత్యన్నారాయణకు చెందిన ఎరువుల దుకాణంలో రూ. 8 వేలను దుండగులు దొంగిలించారు. అలాగే వీరభద్ర సన్స్ మద్యం దుకాణం వెనక తలుపులను గునపంతో పగలగొట్టి లోపలికి చొరబడి రూ. 30 వేల నగదు, మద్యం బాటిళ్లు పట్టుకుపోయారు. గ్రామంలోని వీఆర్ఓ ముత్యాలరావు ఇంటి ముందు పార్క్ చేసి ఉంచిన ద్విచక్రవాహనాన్ని కూడా మాయం చేశారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలోని మహమ్మద్ సుబాని ఇంట్లోకి చొరబడి బీరువాలోని రూ.5 వేల నగదును అపహరించారు. గాదం కమలాకర్‌కు చెందిన కిరాణా, జనరల్ స్టోర్స్‌లో చొరబడి బీరువా తెరిచి వెండి మొలతాడు, చిల్లర నగదు తీసుకెళ్లారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఈ వరుస దొంగతనాలు జరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో పట్టాయిగూడెం గ్రామంలోనూ మూడిళ్లలో వరుస దొంగతనాలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు విజృంభించారు. గ్రామానికి చెందిన శెట్టిపల్లి చక్రధరరావు, శెట్టిపల్లి పార్థసారథి, దున్నపనేని రఘురామ్ కుటుంబాలు గ్రామాంతరం వెళ్లాయని గ్రహించిన దుండగులు ఆ ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీలకు పాల్పడ్డారు. రఘురామ్ కుమార్ ఇంట్లో బీరువా తెరిచి ఐదు కాసుల బంగారు నగలు, రూ.53 వేల నగదును దొంగిలించుకుపోయారు. మిగిలిన ఇద్దరూ దూరాంతరం వెళ్లడంతో ఆ ఇళ్లలో ఏమేం చోరీకి గురయ్యాయో తెలియరాలేదు. ఒకే రోజు రాత్రి రెండు గ్రామాల్లో వరుస చోరీలు జరగడంతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. చింతలపూడి ఏఎస్సై ఆలి, క్రైమ్ బ్రాంచ్ ఏఎస్సై ఎం.డి. మగ్బుల్, హెడ్ కానిస్టేబుల్ సోంబాబు ఘటనాస్థలాలను పరిశీలించారు. తలుపులు తెరవడానికి ఉనయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకుని, బాధితుల నుంచివివరాలను సేకరించారు. ఈ చోరీలన్నీ ఒకే ముఠా చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఏలూరు నుంచి క్లూస్ టీమ్‌లను రప్పిస్తున్నామని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరులో.. ఏలూరు అర్బన్ : ఏలూరులోనూ తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగలు పడ్డారు. టూ టౌన్ ఎస్సై ఎస్.ఎస్.ఆర్.గంగాధర్ కథనం ప్రకారం.. స్థానిక 30వ డివిజన్ పత్తేబాద ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనందం మోహన కృష్ణారావు ఈ నెల 21న ఇంటికి తాళాలు వేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భీమవరం వెళ్లారు. తిరిగి 22వ తేదీ రాత్రి వచ్చారు. ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి ఇంటిలోకి వెళ్లి పరిశీలించారు. బీరువా తెరిచి ఉంది. అందులోని సుమారు ఆరు కాసుల బంగారు బ్రాస్లెట్, ఒక ఉంగరం, గొలుసు ఏడు తులాల విలువైన వెండిసామగ్రి కనిపించలేదు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై గంగాధర్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మాటలుండవు ‘చేతలే’!
స్నాచింగ్ సమయంలో తెలివిగా వ్యవహరించే గ్యాంగ్ షామ్లీ జిల్లాలో 12 గ్రామాల్లో నివసిస్తున్న బవరియాలు సోని పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయం సిటీబ్యూరో: చిరునామా చెప్పమని అడుగుతూనో... మంచి నీళ్లు కావాలనో.. దుకాణంలో సరుకులు కావాలంటూ నో... ఇలా ఏదో ఒక రకంగా బాధితులతో మాటలు కలిపి గొలుసు దొంగతనాలు చేయడం స్నాచర్ల నైజం. అయితే నగరంపై విరుచుకుపడి మూడు రోజుల్లో 14 నేరాలు చేసిన బవరియా గ్యాంగ్ స్టైలే వేరు టార్గెట్ చేసుకున్న మహిళలతో అసలు మాట్లాడరు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన సోను ఈ ముఠాకు చెందిన సభ్యడన్న విషయం విదితమే. ఈ గ్యాంగ్ లీడర్ మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ సహా మరికొందరి కోసం జంట కమిషనరేట్ల అధికారులు వేట కొనసాగిస్తున్నారు. ఒక చోట మాత్రమే డైలాగ్స్... గత నెల 13, 14, 15 తేదీల్లో జంట కమిషనరేట్ల పరిధిలోని 14 ప్రాంతాల్లో పంజా విసిరిన ఈ ముఠా సభ్యులు కేవలం ఒక్క చోటే బాధితురాలితో మాట కలిపారు. మిగిలిన 13 ఉందంతాల్లోనే సంజ్ఞలతోనే ‘పని’ పూర్తి చేసుకుపోయారు. రెండు బృందాలుగా వేర్వేరు వాహనాలపై బయలుదేరే మంగళ్ గ్యాంగ్ ‘పెలైట్’, ‘హిట్’ పంథాలో రెచ్చిపోతుంది. నగరంలో పంజా విసిరిన మూడు రోజుల్లో టార్గెట్‌గా చేసుకున్న ఓ మహిళ వద్దకు వెళ్లిన ముఠా సభ్యుడు సమీపంలో ఉన్న చెట్టు వైపు చెయ్యెత్తి చూపించాడు. అక్కడ ఏముందా అని ఆ మహి ళ అటు చూడగా... గొలుసు లాక్కుని బైక్ ఎక్కి పారిపోయాడు. మరో ఉదంతంలో మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చి అరుగుపై కూర్చున్న మహిళ వద్దకు వెళ్లిన గ్యాంగ్ మెంబర్ ఆమె సమీపంలో నేలపై రాయడం మొదలెట్టాడు. అదేంటో చూద్దామని ఆ మహిళ కిందికి వంగగా... మెడలోని పుస్తెల తాడు లాక్కొని ఉడాయిం చాడు. మిగిలిన నేరాలనూ ఇలానే చేసిందీ బవరియా గ్యాంగ్. భాషతో ప్రాంతం తెలుస్తుందని... ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని 12 గ్రామాల్లో బవరియా తెగవారు నివసిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో చైన్ స్నాచింగ్స్తో పాటు ఇతర నేరాలు చేయడమే వీరి వృత్తి. బడాకాన్పూర్, జఠాన్పూర్, రామ్‌పుర, సూక్రా, నవబస్, ధూద్దీ, మసద్ఘడ్, ఛోటా కాన్పూర్, బైరాహియాం, హ్మద్ఘడ్, ఖేడీ, లాధీపూర్ల్లో ఈ తెగ విస్తరించి ఉంది. నాగరికత ఆనవాళ్లు పూర్తిగా కనిపించని ఆ గ్రా మాల్లోని యువత ఎప్పటికప్పుడు వేర్వేరు ముఠాలు కడుతూ నేరాలు చేయడమే వృత్తిగా చేసుకున్నారు. ఇలా దేశ వ్యాప్తంగా నేరాలు చేసే వీరు బాధితులతో మాట్లాడితే... తమ భాష, యాస ఆధారంగా తాము ఏ ప్రాంతం వారిమో అనేది పోలీసులు పసిగట్టి పట్టుకుం టారనే భయంతో దొంగలు సాధ్యమైనంత వరకు మా టలకు దూరంగా ఉండి ‘చేతల’తో రెచ్చిపోతుంటారు. స్థానికంగా ఏ నేరాలు చేయరు... ఎంపిక చేసిన నగరాల్లో ఇళ్ల అద్దెకు తీసుకుని డెన్లు ఏర్పాటు చేసుకుంటూ రోజుల తరబడి మకాం వేసి మరీ పంజా విసురుతాయి బవరియా ముఠాలు. తమ సొంత ప్రాంతంలో మాత్రం ఎలాంటి నేరాలు చేయవు. దీనికితోడు స్థానిక పోలీసులతో వీరికి ‘ములాఖత్’ ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి పోలీసులు వస్తే ఆ విషయాన్ని అక్కడి పోలీసులే బవరియాలకు చేరవేస్తారు. ఇలా చేసినందుకు వారికి భారీ ‘పారితోషికాలే’ ముడతాయట. బవరియాలు నివసించే 12 గ్రామాలూ పక్కపక్కనే ఉండటంతో ఓ గ్రామంలోని వారికి విషయం తెలిస్తే చాలు.. చాలా తేలిగ్గా మిగిలిన వారికీ పాకి అందరూ అప్రతమత్తం అవుతారు. అలాగని స్థానిక పోలీసుల సహకారం లేకుండా బయటి పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే వారిపై దాడులకూ వెనుకాడరు. ఒకే ఒక్కడు నుంచి ముఠాలుగా... షామ్లీ జిల్లాలోని బవరియా తెగకు ఒకప్పుడు ఛత్రసేన అనే వ్యక్తి నాయకుడిగా ఉండేవాడు. ఇతడే పదుల సంఖ్యలో ముఠాలు నిర్వహిస్తూ నేరాలు చేయించేవాడు. దేశ వ్యాప్తంగా నేరాలు ఇతడి నేతృత్వంలోనే జరిగేవి. కాలక్రమంలో ఎవరికి వారు ముఠాలు ఏర్పాటు చేసుకుని రెచ్చిపోవడం ప్రారంభించడంతో మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ లాంటి వాళ్లు పెరిగిపోయారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మన్‌ప్రీత్ ఇల్లు బడా కాన్పూర్‌లో పెద్ద కోటను తలపిస్తూ గేటులతో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో నేరాలు చేయడానికి వెళ్లినా.. ముఠా సభ్యులకు అవసరమైన అన్ని ఖర్చులూ అతడే భరిస్తాడు. నివాసం, ఆహారం, ఇతర ఖర్చులు మాత్రమే కాదు... ఎవరైనా పోలీసులకు చిక్కితే బెయిల్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. ఈ నేపథ్యంలోనే చోరీ సొత్తులో అధిక మొత్తం అతడే తీసుకుంటాడు. ముఠా సభ్యులకు మాత్రం సొత్తు విలువను బట్టి ఒక్కో చోరీకి రూ.10 నుంచి రూ.15 వేల చొప్పున ఇస్తాడని పోలీసులు చెప్తున్నారు. గురువారం అరెస్టు చేసిన సోనును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న తర్వాత నగర పోలీసులు మరోసారి షామ్లీకి వెళ్లాలని నిర్ణయించారు. -
మిట్ట మధ్యాహ్నమే...
మల్కాజిగిరి, సరూర్‌నగర్, మేడిపల్లి పీఎస్ పరిధిల్లో గొలుసు దొంగతనాలు మధ్యాహ్నం సమయంలోనే ఘటనలు సుమారు ఆరు తులాల నగలతో ఉడాయింపు సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చైన్‌స్నాచర్లు మరోసారి వీరంగం సృష్టించారు. సోమవారం నాడు మూడుచోట్ల రెచ్చిపోయిన గొలుసు దొంగలు...మధ్యలో రెండు రోజుల విరామమిచ్చి మళ్లీ తెగబడ్డారు. మేడిపల్లి, సరూర్‌నగర్, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళల మెడల్లోంచి సుమారు ఆరు తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ మూడు ఘటనలు మధ్యాహ్నం సమయంలో జరగడంతో వేర్వేరు చైన్ స్నాచర్లు ఈ పనిచేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అద్దె ఇళ్లు కోసం వెతుకుతుండగా... మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో అద్దె ఇళ్లు కోసం వెతుకుతున్న పద్మ అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లారు. ‘మేడిపల్లికి చెందిన పద్మ తోటి కోడలు అనురాధ మౌలాలి జవహర్‌నగర్‌లో ఉంటోంది. అయితే పద్మ కూడా నివాసాన్ని జవహర్‌నగర్‌కు మార్చేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అనురాధతో కలిసి అద్దె ఇళ్లు వెతుకుతోంది. ఇది గమనించిన బైక్‌పై ఉన్న ఇద్దరు దుండగులు..పద్మ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపానికి వచ్చేవరకు చూశారు. ఎదురుగా వేగంగా వచ్చి మెడలో మూడు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లార’ని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన కిలోమీటర్ దూరంలోనే సీసీటీమ్ ఉండటం గమనార్హం. కూతురు ఇంటికి వెళుతుండగా... చైతన్యపురి: సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని చంపాపేటలో నివాసముండే తారకమ్మ గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటి సమీపంలోని కూతురు ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కుని పారిపోయారు. అయితే పుస్తెలతాడుకు సుమారు నాలుగు గ్రాములు బంగారు పుస్తెలు మాత్రమే ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలను తీసుకొద్దామని... బోడుప్పల్: ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే జైతులు రోజు మాదిరిగా గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానికంగా వున్న స్కూల్లో చదువుకుంటున్న పిల్లలను తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. వెనక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ ఆగంతుకుడు ఆమె మెడలో నుంచి రెండు తులాల నల్లపూసల తాడును తెంచుకుని పారిపోయాడు. జైతులు కుటుంబ సభ్యులతో కలిసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. -
విజృంభిస్తున్న చైన్‌స్నాచర్లు
- మూడు రోజుల్లో 20 గొలుసు దొంగతనాలు - స్నాచింగ్‌కు యువత అలవాటు - పెండింగ్‌లోనే అనేక కేసులు - ఆనవాళ్లు దొరకక పోలీసుల తంటాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో దొంగలు రెచ్చిపోయారు. దాదాపు 20 చోట్ల చోరీలకు పాల్పడి 60 తులాలకు పైగా బంగారాన్ని దోచుకెళ్లారు. నగరాలు, పట్టణాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బైక్‌లపై తిరుగుతూ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారి మెడల్లోని ఆభరణాలను తెంచుకొని ఉడాయిస్తున్నారు. ఈ ఘటనల్లో మహిళలు తీవ్రంగా గాయపడుతున్నారు. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఒక పక్క ప్రొఫెషనల్స్, మరో పక్క కొత్త నేరగాళ్లు చైన్‌స్నాచింగ్ చేస్తున్నారు. కొత్త నేరస్తుల రికార్డులు లేకపోవడంతో పోలీసులకు ఈ కేసులు కత్తిమీద సాము అవుతున్నాయి. మరోపక్క నగరాల్లో సీసీటీవీ కెమెరాల డొల్లతనాన్ని బయటపెడుతున్నాయి. మహిళలను టార్గెట్‌గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న నేరగాళ్ల ఆనవాళ్లు దొరకక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి బయటి రాష్ట్రాల నుంచి వచ్చి, వెంటనే సొంత ప్రదేశాలకు వెళ్లకుండా వేరే చోటికి వెళ్లి జల్సాలు చేస్తుండటంతో వారి ఆనవాళ్లు కూడా దొరకడం లేదు. ఇటీవల నిజామాబాద్ జిల్లా బికనూరు వద్ద పోలీసులకు పట్టుబడిన దొంగలను విచారించిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. ఆధారాలు లభించిన వాళ్ల సొంతూళ్లకు వెళ్లినా వారు దొరకని పరిస్థితి ఏర్పడింది. నేరగాళ్ల ఆనవాళ్లు దొరకకపోవడంతో సగానికి పైగా కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. హైదరాబాద్‌లో 2012 సంవత్సరంలో 643 చైన్‌స్నాచింగ్‌లు జరగగా, వాటిలో 315 కేసులు పెండింగ్‌లోనే ఉన్నాయి. 2013కు చెందిన 340 కేసులు, 2014కు చెందిన 230 కేసులు ఆధారాల్లేక పెండింగ్‌లో ఉండిపోయాయి. వరంగల్‌లో ఈ ఏడాది 62 చైన్ స్నాచింగ్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ మంది యువతే.. చైన్స్నాచర్స్పై నమోదవుతున్న కేసుల్లో చాలా మంది సులభంగా బయటికొస్తున్నారు. నేర చరిత్ర ఉంటే తప్ప చైన్స్నాచర్లపై పీడీ యాక్ట్ పెట్టడం లేదు. సీసీ కెమెరాల్లో చిక్కిన వారంతా యువతేనని, వారికి ఎటువంటి నేర చరిత్ర లేనందున పట్టుకోవడం కష్టమవుతోందని పోలీసులు వాపోతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నేరాల బాటపడుతున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్నట్లు ఎన్సీఆర్బీ-2014 గణాంకాలు చెబుతున్నాయి. కొత్తగా నమోదవుతున్న నేరాల్లో 40 శాతం వరకు యువతే ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి. -
అమ్మో.. బెంగాల్ దొంగలు..
జిల్లాలో ఏదో ఒకచోట గొలుసు దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. గత నెల 28 వరలక్ష్మీ వ్రతం నాడు ఇళ్లలో పూజలు ఆచరించి, దేవాలయాలకు వెళుతున్న మహిళలపై ైచైన్ స్నాచర్‌స విరుచుకుపడ్డారు.పోలీసులు సైతం దిగ్భ్రాంతి చెందేలా ఒకటీ రెండూ కాదు పదిచోట్ల మహిళల మెడలో గొలుసులు తెంపుకొనిపోయారు. ఇప్పటికీ ఈ దొంగతనాలు అక్కడక్కడ చోటుచేసుకుంటూనే ఉన్నాయి. - హడలెత్తిస్తున్న చైన్ స్నాచింగ్ ముఠా - పోలీసులకు సవాల్ విసురుతున్న ముఠా - అక్కడక్కడ దొంగతనాలు - నిందితులను పట్టుకోవడంలో కానరాని పురోగతి ఎంవీపీ కాలనీ(విశాఖ): గొలుసు దొంగతనాలను ముందు తేలిగ్గా తీసుకున్న పోలీసులు తర్వాత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కొద్ది గంటల వ్యవధిలో పదిచోట్ల ఇలా జరగడంతో అప్రమత్తమయ్యారు. ఒక్క విశాఖలోనే కాక విజయవాడ, గుంటూరు నగరాల్లో కూడా ఇదే రీతిలో చైన్ స్నాచింగ్ కేసులు నమోదయ్యాయని తెలుసుకొని విస్తుపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని న్యూజల్పాయిగురికి చెందిన చైన్‌స్నాచింగ్ ముఠాయే ఇందుకు కారణమని, ఆరితేరిన దాదాపు 70మంది ముఠా మన రాష్ట్రంలో దిగిందని పోలీసులు గుర్తించారు. వీరు గ్రూపులుగా విడిపోయి ప్రముఖ నగరాల్లో హల్చల్ చేస్తున్నారు. అందులో రెండు గ్రూపులు విశాఖ నగరంపై గురిపెట్టాయి. నగరంలో పలు ప్రాంతాల్లో మహిళల మెడల్లోని గొలుసులను తెంపుకొనిపోతూ కలకలం సృష్టిస్తున్నాయి. పెరిగిన గొలుసు దొంగతనాలు ఇటీవల ఉదయం వేళ చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మార్నింగ్ వాక్ చేస్తున్నా... గుడికి వెళ్తున్నా... కాలనీలో నడిచి వెళ్తున్నా... ఈ ప్రమాదం పొంచి ఉంటోంది. ఎంవీపీ కాలనీలో గత నెలలో జరిగిన దొంగతనాలకు జనాలు బెంబేలెత్తిపోతున్నారు. ఇటీవల జగదాంబ జంక్షన్లో కొన్ని షాపింగ్‌మాల్స్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆఫర్లు ప్రకటించడంతో జనం ఎగబడ్డారు. సందట్లో సడేమియాలా ఇద్దరు యువకులు చేతివాటం ప్రదర్శించారు. ఇటీవల ఓల్డ్డైరీ ఫారం వద్ద ఉదయాన్నే ముగ్గువేస్తున్న మహిళాపై దాడి చేసి మంగళసూత్రాన్ని తస్కరించారు. ఎంవీపీ కాలనీలో సమతా కళాశాల జంక్షన్లో సాయంత్రం పానీపురీ తింటున్న మహిళా మేడలో చైన్‌ను కూడా తెంపి మరో ఇద్దరు యువకులు పారిపోయారు. పోలీసులకు తలనొప్పి కొన్ని రోజులుగా చైన్ స్నాచింగ్ ముఠా పెద్ద తలనొప్పిగా తయారైంది. వీరు వృద్ధ మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వారైతే ప్రతిఘటించలేరని వారి అంచనా. కరడు కట్టిన దొంగలతోపాటు విలాస జీవితానికి అలవాటుపడిన విద్యార్థులు, యువకులు చైన్ స్నాచింగ్‌ను సంపాదన మార్గంగా ఎంచుకుంటున్నారని పోలీసులు చెబుతున్నారు. గొలుసు దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలు గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాట్లు చేశారు. ఈ బెంగాల్ చైన్‌స్నాచింగ్ ముఠా ఆట కట్టించేందుకు పోలీసు శాఖ మరింత పకడ్బందీ వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంది. -
చైన్ కిల్లర్స్
పెరుగుతున్న గొలుసు దొంగతనాలు తీవ్రంగా గాయపడుతున్న మహిళలు గత నెలలో ఓ మహిళ మృతి రోడ్డుపైకి వచ్చేందుకే భయం అత్యాధునిక వాహనాలు... అదే స్థాయిలో ఆయుధాలు... అడుగడుగునా సీసీ కెమెరాలు... సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు... విశ్వనగరం వైపు అడుగులు... ఈ ఆర్భాటాలు సరే. పట్టపగలు... నడిరోడ్డు మీదే చైన్‌స్నాచర్లు బరి తెగిస్తున్నారు. స్త్రీల మెడలోని ఆభరణాలు దోచుకుంటున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో సుమిత్ర అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరుస దుర్ఘటనలతో రోడ్డు పైకి రావడానికే మహిళలు భీతిల్లుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ ఘోరాలను అరికట్టడంలో దారుణంగా విఫలమవుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో సిటీబ్యూరో: నిన్న మొన్నటి వరకు ‘మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు... ఎవరినైనా తోడు తీసుకెళ్లాల’ని ప్రచారం చేసిన పోలీసులకు... ఈ ఘటనలతో ప్రజలకు ఏ సూచనలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఒంటరిగా ఉన్నా... గుంపుగా వెళుతున్నా... దొంగతనాలకు అడ్డుకట్ట పడడం లేదు. మహిళ ల మెడలోని ఆభరణాలను తెంచుకొని దుండగులు రెప్పపాటులో మాయమైపోతున్నారు. ఇక్కడా...అక్కడా... పగలూ...రాత్రీ అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో బంగారం కోసం మహిళలను గాయపరిచేందుకు సైతం దొంగలు వెనుకాడటం లేదు. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటనలో బర్కత్‌పుర వాసి సుమిత్ర మృతి చెందింది. ఈ సంఘటన ఇప్పటికీ సిటీవాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. కుమారుడు వెంట ఉన్నా... తల్లిని కాపాడుకోలేకపోయాడు. మాటలు...చేతలకు పొంతనేదీ? హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చే క్రమంలో నిఘా, భద్రతను బలోపేతం చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు... వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం... వేలల్లో సీసీ కెమెరాలు...ప్రతి క్షణం నిఘా... ఏ రోజుకారోజు పోలీసుల పనితీరును బేరీజు వేసేందుకు పోలీసు వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ యాప్... ఇలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని చెబుతున్న పోలీసులు... మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. వరుస చోరీలు జరుగుతున్నా కనీసం దొంగలను కనిపెట్టలేకపోతున్నారని, రక్షక్, మొబైల్ వాహనాలు ఉన్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు. పోలీసు నిఘా లేని ప్రాంతాల్లో నడి వయస్సు దాటిన మహిళలనే లక్ష్యంగా చేసుకొని మెడలోని గొలుసులను లాక్కెళ్లే ఘటనలు గతంలో కనిపిస్తుండేవి. చైన్ స్నాచింగ్లోకి అడుగు పెడుతున్న యువకులు...బైక్ రేసింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న జంటలను, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి... సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్న దొంగలు మహిళల ప్రాణాలకే హాని తల పెడుతున్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుచరులతో పాటు డబ్బు కోసం కొందరు విద్యార్థులు కూడా అకృత్యాలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్‌ల తీవ్రత పెరుగుతుండటంతో పోలీసులు దొంగలపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. స్నాచర్లను పట్టుకునేందుకు మారువేషాల్లో మహిళా కానిస్టేబుళ్లు నగలతో వెళుతున్నా ప్రయోజనం కనబడటం లేదు. కొత్తపేట నుంచి మంగళవారం రాత్రి మలక్‌పేటలోని అక్బర్‌బాగ్ డివిజన్ ఆనంద్ నగర్‌కు బయలుదేరారుకంభంపాటి రామకృష్ణ, శ్వేత దంపతులు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... నల్లని పల్సర్ ైబైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు శ్వేత మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని నల్లగొండక్రాస్ రోడ్డు వైపు ఉడాయించారు. ఈ క్రమంలో శ్వేతకు గాయాలయ్యాయి. మలక్‌పేట ‘బి’ క్వార్టర్‌కు చెందిన శ్రీనివాస్, భార్య వర్ధనమ్మ (52)తో కలసి మంగళవారం రాత్రి నల్గొండ ైఫ్లైఓవర్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని ఆభరణాల తెంచుకొని పరారయ్యారు. వాహనం పై నుంచి కిందపడిన వర్ధనమ్మ తీవ్రంగా గాయపడింది. మేడిపల్లికి చెందిన శిరీష (40) ఒంగోలు నుంచి వస్తూ బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో బస్సు దిగారు. భర్త నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికిబయలుదేరారు. బైక్‌పై వచ్చిన దుండగులు శిరీష మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ఈ ఘటనలోనూ శిరీషకు గాయాలయ్యాయి. మన బాధ్యతా ఉంది.. కేవలం పోలీసులే కాదు... మనం కూడా కనీస జాగ్రత్తలు పాటించాలి. డ్రెస్ వేసుకుంటే మెడపై చున్నీ, ముఖానికి స్కార్ప్ ఉండేలా చూసుకోవాలి. వివాహితులైన మహిళలు చీర కొంగును మెడకు చుట్టుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో కొంతమేరక దొంగతనాలు తగ్గే అవకాశముంది బంగారు గొలుసు చోరీ రాజేంద్రనగర్: బైక్‌పై ఇంటికి వెళుతున్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును చైన్‌స్నాచర్లు తెంచుకొని పరారయ్యారు. పెద్ద మంగళారం ప్రాంతానికి చెందిన అనసూయ(35) బుధవారం ఆరమైసమ్మ ప్రాంతంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన మరిది రాజుతో కలిసి వాహనంపై వెళుతుండగా... పోలీసు అకాడమీ వద్ద వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు అనసూయ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వాహనాలపై వస్తుండగా... చైతన్యపురి/నాగోలు: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన అగంతకులు లాక్కెళ్లిన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్టీఆర్ నగర్‌కు చెందిన అంజని కుమారి (52) మంగళవారం రాత్రి కుమార్తె అభిషాతో కలిసి ద్విచక్ర వాహనంపై వైట్‌హౌస్ సమీపంలోని సోదరి ఇంటికి వె ళ్లారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా స్వర్ణకంచి షోరూం సమీపంలో బైకుపై వచ్చిన ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న అంజనీ కుమారి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని దిల్సుఖ్నగర్ వైపు పరారయ్యారు. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదే ముఠా నగరంలోని వివిధ ప్రాంతాలలో గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఎల్బీన గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో... భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయిన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడిపల్లికి చెందిన శిరీష (40) ఒంగోలుకు వెళ్లి బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో బస్సు దిగారు. భర్త నాగేశ్వరరావుతో కలిసి 10.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మేడిపల్లి వెళ్తుండగా... ద్వి చక్ర వాహనంపై వచ్చిన దుండగులు శిరీష మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
గొలుసు దొంగల్ని పట్టిస్తే నగదు బహుమతి
రూ. 15 వేలు ఇస్తామని ప్రకటించిన పోలీసు శాఖ సాక్షి, ముంబై: గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ఓ వినూత్న యోచన చేసింది. దొంగల్ని పట్టించిన వారికి రూ.15 వేలు నగదు బహుమతి ప్రకటించింది. మరోవైపు గొలుసు దొంగతనాలకు అడ్డుకట్టవేసేందుకు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకున్న సంగతి విదితమే. ఇందులో భాగంగా ఠాణే పోలీసు శాఖ సెంట్రల్ యూనిట్‌ను ఏర్పాటుచేసింది. పట్టుబడిన గొలుసు దొంగలపై మోకా చట్టం కింద కేసు నమోదు చేయడం ప్రారంభించింది. అయినప్పటి కీ ఎటువంటి ఫలితమూ లేకపోయింది. ఇది పోలీసుశాఖకు సవాలుగా మారింది. దీంతో గొలుసు దొంగల్ని పట్టుకునేందుకు అవసరమైతే ఆయుధాలను వినియోగించాలని హోం శాఖ మాజీ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ అప్పట్లో తన సిబ్బందిని ఆదేశించారు. మహిళలు రోడ్లపై నడవకుండా కార్పొరేషన్ సహాయంతో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించాలని నిర్ణయించారు. అయితే ముంబై, ఠాణే లాంటి కీలక నగరాల్లో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించడం సాధ్యం కాలేదు. దీంతో చేతులెత్తేసిన పోలీసు శాఖ ఈ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. గొలుసు దొంగలను పట్టుకునే బాధ్యత నగర పౌరులకే వదిలే సింది. ఇందుకు పారితోషికం కింద రూ. 15 నగదు బహుమతిని అందజేసేందుకు సైతం సిద్ధపడింది. బహుమతి ప్రకటించే సమయంలో మహిళలకు కొన్ని సూచనలు కూడా చేసింది. గృహిణులు, ఉద్యోగం చేసే మహిళలు ఇంటి నుంచి బయట ముందు సాధ్యమైనంత వరకు తక్కువ నగలు ధరించాలి. నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంట రిగా నడవకూడదు. మంగళసూత్రం లేదా గొలుసు వేసుకుంటే మెడను చీర కొంగు లేదా దుప్పట్టా (చున్నీ)తో కప్పుకోవాలి. గొలుసు దొంగలు హెల్మెట్ ధరిస్తే కేకలు వేయడంతోపాటు వారు పారిపోతున్న వాహనం నంబరును నోట్ చేసుకోవాలని సూచించింది. ఇందువల్ల వారిని పట్టుకోవడం మరింత సులభమవుతుందని ఆ శాఖ భావిస్తోంది. -
రెచ్చిపోతున్న చైన్‌స్నాచర్లు
*మహిళలే లక్ష్యంగా గొలుసు దొంగతనాలు * తాడేపల్లిగూడెంలో వారం రోజుల్లో మూడు ఘటనలు తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోతున్నారు.. ఒంటిపై ఆభరణాలతో నడిచి వెళ్తున్న మహిళలే లక్ష్యంగా దోపిడీలకు తెగబడుతున్నారు. పట్టణంలో వారం రోజుల్లో వ్యవధిలో మూడు ఘటనలు చోటు చేసుకున్నారుు. గురువారం సాయంత్రం స్థానిక వీకర్స్ కాలనీకి చెందిన శ్రీధర గాయత్రి వాణి తన కుమారుడికి సంగీతం నేర్పించేందుకు తె నుకుల కోటయ్య వీధిలో ఉండే టీచర్ ఇంటికి తీసుకెళ్తుండగా.. వీధిలోకి వెళ్లేసరికి ఎదురుగా మోటార్ సైకిల్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు సూత్రాల తాడును లాక్కుపోయూడు. గట్టిగా పట్టుకోవడంతో సూత్రాలు ఆమె చేతిలోనే ఉండిపోయాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం పట్టణంలోని కృష్ణుడు చెరువు వద్ద ఓ మహిళ మెడలోని బంగారు గొలుసును గుర్తు తెలియని వ్యక్తి తెంపుకుపోయూడు. వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మరో చైన్‌స్నాచింగ్ జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. వారంలో వరుసగా మూడు చోరీలు జరగడంతో స్థానిక మహిళలు బయటకు రావడానికే భయపడుతున్నారు. ఈ ఘటనలన్నీ పట్టపగలే జరగడం గమనార్హం. చైన్‌స్నాచింగ్‌లపై పోలీస్ నిఘా పెట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. గుండుగొలనులో ఆభరణాల చోరీ భీమడోలు : ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు బీరువాలోని 4 కాసుల బంగారు ఆభరణాలను ఎత్తుకుపోయూరు. భీమడోలు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ అమీర్ తెలిపిన వివరాల ప్రకారం.. గుండుగొలను గ్రామం వేగిరెడ్డివారి వీధిలో నివాసం ఉంటున్న పోలా సింహాచలం కుమార్తె కుసుమకు వివాహం కాగా, కైకరంలోని అత్తారింట్లో ఉంటోంది. అనారోగ్యంగా ఉండడంతో కొద్దిరోజుల క్రితం పుట్టింటికి వచ్చింది. బుధవారం రాత్రి మెడలోని బంగారు నానుతాడు, చెవిదిద్దెలతో పాటు ఇతర ఆభరణాలను బీరువాలో భద్రపరిచింది. ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అర్ధరాత్రి సమయంలో లోనికి ప్రవేశించిన దొంగలు బీరువాలో పెట్టిన బంగారు ఆభరణాలను దోచుకుపోయూరు. ఉదయాన్నే నిద్రలేచిన ఇంట్లోని వారంతా బీరువా తలుపులు తెరిచి ఉండడంతో కంగారుపడి ఆభరణాల కోసం వెతికారు. అనంతరం చోరీకి గురైనట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.