మిట్ట మధ్యాహ్నమే...
మల్కాజిగిరి, సరూర్‌నగర్, మేడిపల్లి పీఎస్ పరిధిల్లో గొలుసు దొంగతనాలు
మధ్యాహ్నం సమయంలోనే ఘటనలు
సుమారు ఆరు తులాల నగలతో ఉడాయింపు
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో చైన్‌స్నాచర్లు మరోసారి వీరంగం సృష్టించారు. సోమవారం నాడు మూడుచోట్ల రెచ్చిపోయిన గొలుసు దొంగలు...మధ్యలో రెండు రోజుల విరామమిచ్చి మళ్లీ తెగబడ్డారు. మేడిపల్లి, సరూర్‌నగర్, మల్కాజిగిరి పోలీసు స్టేషన్ల పరిధిలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మహిళల మెడల్లోంచి సుమారు ఆరు తులాల బంగారు గొలుసులను లాక్కెళ్లారు. ఈ మూడు ఘటనలు మధ్యాహ్నం సమయంలో జరగడంతో వేర్వేరు చైన్ స్నాచర్లు ఈ పనిచేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
అద్దె ఇళ్లు కోసం వెతుకుతుండగా...
మల్కాజిగిరి: మల్కాజిగిరి పోలీసు స్టేషన్ పరిధిలోని జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపంలో అద్దె ఇళ్లు కోసం వెతుకుతున్న పద్మ అనే మహిళ మెడలో నుంచి మూడు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లారు. ‘మేడిపల్లికి చెందిన పద్మ తోటి కోడలు అనురాధ మౌలాలి జవహర్‌నగర్‌లో ఉంటోంది. అయితే పద్మ కూడా నివాసాన్ని జవహర్‌నగర్‌కు మార్చేందుకు గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో అనురాధతో కలిసి అద్దె ఇళ్లు వెతుకుతోంది. ఇది గమనించిన బైక్‌పై ఉన్న ఇద్దరు దుండగులు..పద్మ జవహర్‌నగర్ కమ్యూనిటీ హాల్ సమీపానికి వచ్చేవరకు చూశారు. ఎదురుగా వేగంగా వచ్చి మెడలో మూడు తులాల బంగారు గొలుసు తెంపుకెళ్లార’ని పోలీసులు తెలిపారు. అయితే ఈ ఘటన జరిగిన కిలోమీటర్ దూరంలోనే సీసీటీమ్ ఉండటం గమనార్హం.
కూతురు ఇంటికి వెళుతుండగా...
చైతన్యపురి: సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని చంపాపేటలో నివాసముండే తారకమ్మ గురువారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఇంటి సమీపంలోని కూతురు ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంది. అదే సమయంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని పుస్తెలతాడు లాక్కుని పారిపోయారు. అయితే పుస్తెలతాడుకు సుమారు నాలుగు గ్రాములు బంగారు పుస్తెలు మాత్రమే ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
పిల్లలను తీసుకొద్దామని...
బోడుప్పల్: ఈస్ట్ బాలాజీ హిల్స్ కాలనీలో నివసించే జైతులు రోజు మాదిరిగా గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో స్థానికంగా వున్న స్కూల్‌లో చదువుకుంటున్న పిల్లలను తీసుకొచ్చేందుకు ఇంటి నుంచి బయలుదేరింది. వెనక నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఓ ఆగంతుకుడు ఆమె మెడలో నుంచి రెండు తులాల నల్లపూసల తాడును తెంచుకుని పారిపోయాడు. జైతులు కుటుంబ సభ్యులతో కలిసి మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.