చైన్ కిల్లర్స్
పెరుగుతున్న గొలుసు దొంగతనాలు
తీవ్రంగా గాయపడుతున్న మహిళలు
గత నెలలో ఓ మహిళ మృతి
రోడ్డుపైకి వచ్చేందుకే భయం
అత్యాధునిక వాహనాలు... అదే స్థాయిలో ఆయుధాలు... అడుగడుగునా సీసీ కెమెరాలు... సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త పుంతలు... విశ్వనగరం వైపు అడుగులు... ఈ ఆర్భాటాలు సరే. పట్టపగలు... నడిరోడ్డు మీదే చైన్‌స్నాచర్లు బరి తెగిస్తున్నారు. స్త్రీల మెడలోని ఆభరణాలు దోచుకుంటున్నారు. దాడులకు తెగబడుతున్నారు. ఈ క్రమంలోనే గత నెలలో సుమిత్ర అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. వరుస దుర్ఘటనలతో రోడ్డు పైకి రావడానికే మహిళలు భీతిల్లుతున్నారు. రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేష్టలుడిగి చూస్తున్నారు. ఈ ఘోరాలను అరికట్టడంలో దారుణంగా విఫలమవుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
సిటీబ్యూరో: నిన్న మొన్నటి వరకు ‘మహిళలు ఒంటరిగా బయటకు వెళ్లొద్దు... ఎవరినైనా తోడు తీసుకెళ్లాల’ని ప్రచారం చేసిన పోలీసులకు... ఈ ఘటనలతో ప్రజలకు ఏ సూచనలు ఇవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఒంటరిగా ఉన్నా... గుంపుగా వెళుతున్నా... దొంగతనాలకు అడ్డుకట్ట పడడం లేదు. మహిళ ల మెడలోని ఆభరణాలను తెంచుకొని దుండగులు రెప్పపాటులో మాయమైపోతున్నారు. ఇక్కడా...అక్కడా... పగలూ...రాత్రీ అనే తేడా లేకుండా రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో బంగారం కోసం మహిళలను గాయపరిచేందుకు సైతం దొంగలు వెనుకాడటం లేదు. గత నెలలో ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన సంఘటనలో బర్కత్‌పుర వాసి సుమిత్ర మృతి చెందింది. ఈ సంఘటన ఇప్పటికీ సిటీవాసుల కళ్ల ముందు కదలాడుతూనే ఉంది. కుమారుడు వెంట ఉన్నా... తల్లిని కాపాడుకోలేకపోయాడు.
మాటలు...చేతలకు పొంతనేదీ?
హైదరాబాద్‌ను సురక్షిత నగరంగా మార్చే క్రమంలో నిఘా, భద్రతను బలోపేతం చేస్తున్నామంటూ ఉన్నతాధికారులు చెబుతున్న మాటలకు... వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరడం లేదు. అత్యాధునిక
సాంకేతిక పరిజ్ఞానం... వేలల్లో సీసీ కెమెరాలు...ప్రతి క్షణం నిఘా... ఏ రోజుకారోజు పోలీసుల పనితీరును బేరీజు వేసేందుకు పోలీసు వర్క్ ఫోర్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ యాప్... ఇలా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నామని చెబుతున్న పోలీసులు... మహిళలకు భద్రత కల్పించడంలో విఫలమవుతున్నారనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. వరుస చోరీలు జరుగుతున్నా కనీసం దొంగలను కనిపెట్టలేకపోతున్నారని, రక్షక్, మొబైల్ వాహనాలు ఉన్నా ఫలితం లేదని బాధితులు వాపోతున్నారు.
పోలీసు నిఘా లేని ప్రాంతాల్లో నడి వయస్సు దాటిన మహిళలనే లక్ష్యంగా చేసుకొని మెడలోని గొలుసులను లాక్కెళ్లే ఘటనలు గతంలో కనిపిస్తుండేవి. చైన్ స్నాచింగ్‌లోకి అడుగు పెడుతున్న యువకులు...బైక్ రేసింగ్‌పై పట్టు సాధిస్తున్నారు. ఈ క్రమంలో ద్విచక్ర వాహనాలపై వెళుతున్న జంటలను, ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. జల్సాలకు అలవాటు పడి... సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉన్న దొంగలు మహిళల ప్రాణాలకే హాని తల పెడుతున్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లు, అనుచరులతో పాటు డబ్బు కోసం కొందరు విద్యార్థులు కూడా అకృత్యాలకు పాల్పడుతున్నారు. చైన్ స్నాచింగ్‌ల తీవ్రత పెరుగుతుండటంతో పోలీసులు దొంగలపై పీడీ యాక్ట్ పెడుతున్నారు. స్నాచర్లను పట్టుకునేందుకు మారువేషాల్లో మహిళా కానిస్టేబుళ్లు నగలతో వెళుతున్నా ప్రయోజనం కనబడటం లేదు.
కొత్తపేట నుంచి మంగళవారం రాత్రి మలక్‌పేటలోని అక్బర్‌బాగ్ డివిజన్ ఆనంద్ నగర్‌కు బయలుదేరారుకంభంపాటి రామకృష్ణ, శ్వేత దంపతులు. ద్విచక్ర వాహనంపై వెళుతుండగా... నల్లని పల్సర్ ైబైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు శ్వేత మెడలోని రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును తెంచుకుని నల్లగొండక్రాస్ రోడ్డు వైపు ఉడాయించారు. ఈ క్రమంలో శ్వేతకు గాయాలయ్యాయి.
మలక్‌పేట ‘బి’ క్వార్టర్‌కు చెందిన శ్రీనివాస్, భార్య వర్ధనమ్మ (52)తో కలసి మంగళవారం రాత్రి నల్గొండ ైఫ్లైఓవర్ మీదుగా ద్విచక్ర వాహనంపై వెళుతున్నారు. ఇంతలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ఆమె మెడలోని ఆభరణాల తెంచుకొని పరారయ్యారు. వాహనం పై నుంచి కిందపడిన వర్ధనమ్మ తీవ్రంగా గాయపడింది.
మేడిపల్లికి చెందిన శిరీష (40) ఒంగోలు నుంచి వస్తూ
బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో బస్సు దిగారు. భర్త నాగేశ్వరరావుతో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికిబయలుదేరారు. బైక్‌పై వచ్చిన దుండగులు శిరీష మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. ఈ ఘటనలోనూ శిరీషకు గాయాలయ్యాయి.
మన బాధ్యతా ఉంది..
కేవలం పోలీసులే కాదు... మనం కూడా కనీస జాగ్రత్తలు పాటించాలి. డ్రెస్ వేసుకుంటే మెడపై చున్నీ, ముఖానికి స్కార్ప్ ఉండేలా చూసుకోవాలి. వివాహితులైన మహిళలు చీర కొంగును మెడకు చుట్టుకోవాలి. ఇలాంటి చిన్నచిన్న జాగ్రత్తలతో కొంతమేరక దొంగతనాలు తగ్గే అవకాశముంది
బంగారు గొలుసు చోరీ
రాజేంద్రనగర్: బైక్‌పై ఇంటికి వెళుతున్న ఓ మహిళ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును చైన్‌స్నాచర్లు తెంచుకొని పరారయ్యారు. పెద్ద మంగళారం ప్రాంతానికి చెందిన అనసూయ(35) బుధవారం ఆరమైసమ్మ ప్రాంతంలోని బంధువుల ఇంటికి శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో తన మరిది రాజుతో కలిసి వాహనంపై వెళుతుండగా... పోలీసు అకాడమీ వద్ద వెనుక నుంచి వచ్చిన ద్విచక్ర వాహనదారుడు అనసూయ మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును తెంచుకుని పరారయ్యాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నార్సింగ్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వాహనాలపై వస్తుండగా...
చైతన్యపురి/నాగోలు: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలోని గొలుసును బైకుపై వచ్చిన అగంతకులు లాక్కెళ్లిన సంఘటన సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ సునీల్ తెలిపిన వివరాల ప్రకారం... ఎన్‌టీఆర్ నగర్‌కు చెందిన అంజని కుమారి (52) మంగళవారం రాత్రి కుమార్తె అభిషాతో కలిసి ద్విచక్ర వాహనంపై వైట్‌హౌస్ సమీపంలోని సోదరి ఇంటికి వె ళ్లారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా స్వర్ణకంచి షోరూం సమీపంలో బైకుపై వచ్చిన ఇద్దరు అగంతకులు ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న అంజనీ కుమారి మెడలోని నాలుగు తులాల బంగారు గొలుసును లాక్కుని దిల్‌సుఖ్‌నగర్ వైపు పరారయ్యారు. బుధవారం బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఇదే ముఠా నగరంలోని వివిధ ప్రాంతాలలో గొలుసు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఎల్‌బీన గర్ పోలీస్ స్టేషన్ పరిధిలో...
భర్తతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న మహిళ మెడలో నుంచి బైకుపై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయిన సంఘటన ఎల్‌బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... మేడిపల్లికి చెందిన శిరీష (40) ఒంగోలుకు వెళ్లి బుధవారం రాత్రి కర్మన్‌ఘాట్‌లో బస్సు దిగారు. భర్త నాగేశ్వరరావుతో కలిసి 10.20 గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై మేడిపల్లి వెళ్తుండగా... ద్వి చక్ర వాహనంపై వచ్చిన దుండగులు శిరీష మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.