
విదేశీ ఉద్యోగమంటూ వ్యభిచార కూపంలోకి..
- బెంగళూరులోని వ్యభిచార గృహం నుంచి బయటపడ్డ యువతి
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీలో ఫిర్యాదు
నాంపల్లి: విదేశం పంపించి మంచి ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికిన ఓ మహిళ యువతిని బెంగళూరు తీసుకెళ్లి లాడ్జిలో నిర్బంధించింది. అక్కడ వ్యభిచార కూపంలోకి లాగేందుకు యత్నించగా బాధితురాలు తప్పించుకొని హైదరాబాద్ చేరుకుంది. నిందితులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని మంగళవారం మానవహక్కుల కమిషనర్ ను ఆశ్రయించింది. బాధితురాలి కథనం ప్రకారం... నగరంలోని టోలీచౌకి అరవింద్‌నగర్‌కు చెందిన యువతి (28)కు 2003లో పెళ్లైంది.
భర్తతో అభిప్రాయభేదాలు ఏర్పడి విడాకులు తీసుకుంది. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలతో కలిసి తన తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. మెహిందీ డిజైనఖ చేస్తూ వచ్చిన డబ్బుతో పిల్లలను పోషిస్తోంది. ఇదే సమయంలో షాజహాన్ అనే మహిళ ఈమెకు పరిచయం అయింది. గల్ఫ్ దేశాల్లో మెహిందీ డిజైనఖకు మంచి గిరాకీ ఉంటుందని, అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని ఆమె నమ్మబలికింది. దీంతో ఆ మహిళ తన దగ్గర ఉన్న రూ.60 వేలు షాజహాన్ చేతిలో పెట్టగా.. దుబాయి తీసుకెళ్తానని బెంగళూరుకు తీసుకెళ్లింది.
బెంగళూరు నుంచి విమానంలో దుబాయి వెళ్లే విమానం ఎక్కిస్తానని చెప్పి అక్కడ ఉన్న ఓ లాడ్జిలో ఉంచింది. లాడ్జిలో భాస్కర్, ఖాదర్, అష్రఫ్ అనే ముగ్గురిని పరిచయం చేసింది. ఈ ముగ్గురూ అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకర్లు. వారు బాధిత యువతిని వేరే వారికి విక్రయించేందుకు యత్నించారు. వారు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించగా బాధితురాలు తప్పించుకొని నగరానికి చేరుకొని హక్కుల కమిషనర్ ను ఆశ్రయించింది. కాగా, బెంగళూర్‌లోని ఆ లాడ్జిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలువురు అమ్మాయిలు నిర్బంధించబడి ఉన్నారని, సదరు లాడ్జి నిర్వాహకుడికి దుబాయిలోనూ హోటల్స్ ఉన్నట్టు తెలిసిందని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. తనను వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించిన వ్యక్తులతో పాటు విదేశాల్లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసిన మహిళపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీని కోరింది.