
చెత్త తొలగించకపోతే సస్పెన్షన్
- అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్ హెచ్చరిక
సాక్షి, సిటీబ్యూరో: నగర రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పేరుకుపోయిన చెత్త కుప్పలు.. ఇతర త్రావ్యర్థాలను రెండు రోజుల్లోగా తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ సంబంధిత అధికారులకు హుకుం జారీ చేశారు. తొలగించడంలో విఫలమైన వారిని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. నగరంలోని ప్రధాన రోడ్లపై సైతం గుట్టలు.. గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో ఆగ్రహం చెందిన క మిషనర్.. సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉన్నా సరే జీహెచ్‌ఎంసీ పారిశుధ్య విభాగం అధికారులు తమ ప్రధాన విధి అయిన చెత్త తరలింపు పనులు చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో వివిధ స్థాయిల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పెషల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు, జోనల్ కమిషనర్లంతా ఇకనుంచి ప్రతి ఉదయం క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని ఆదేశించారు. చెత్త తరలింపు పనులకు ప్రథమ ప్రాధాన్యత నివ్వాలన్నారు. రహదారులు ఊడ్చే పనులు కూడా మెరుగుపడాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూళ్లపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు.
ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందినప్పటి నుంచీ వసూలు చేయాలని, ఆస్తిపన్నుకు సంబంధించిన డేటాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సర్కిల్ స్థాయిలో టాప్ 250 డిఫాల్టర్లు, కోర్టు వివాదాలు, డబుల్ ఎంట్రీలు, రివిజన్ పిటిషన్లు, జీరో అసెస్‌మెంట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. డిమాండ్ బిల్స్ 15 రోజుల్లోగా పంపిణీ చేసే బిల్‌కలెక్టర్లకు బిల్‌కు రూ. 5లు వంతున, ఆ తర్వాత పంపిణీ చేసే వాటికి రూ. 3 లు వంతున చెల్లిస్తామన్నారు. హోర్డింగులపైనా ఆస్తిపన్ను వసూలు చేయాలని, సెల్ టవర్లకు ఆస్తిపన్ను వసూలు చేసేందుకు తగిన నిబంధనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు.