ఆ ఐదుగురికి ఉరిశిక్ష | Yasin Bhatkal & 4 others sentenced to death by NIA court | Sakshi
Sakshi News home page

ఆ ఐదుగురికి ఉరిశిక్ష

Published Mon, Dec 19 2016 5:02 PM | Last Updated on Wed, Oct 17 2018 5:14 PM

ఆ ఐదుగురికి ఉరిశిక్ష - Sakshi

ఆ ఐదుగురికి ఉరిశిక్ష

హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. ఈ ఐదుగురూ దోషులేనని గత మంగళవారం నిర్ధారించిన కోర్టు ఇవాళ వారికి శిక్షలను  ఖరారు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్‌ ముజాహిదీన్‌ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే! తీర్పు వెలువరిస్తున్న నేపథ్యంలో కోర్టు ఉన్న చర్లపల్లి జైలు వద్ద సోమవారం అత్యంత పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

పాకిస్తాన్‌లో తలదాచుకున్న రియాజ్‌ భత్కల్‌ ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో అతడి సోదరుడు మహ్మద్‌ అహ్మద్‌ సిద్ధిబప్ప అలియాస్‌ యాసీస్‌ భత్కల్‌తో పాటు అసదుల్లా అక్తర్‌ అలియాస్‌ హడ్డీ, జియావుర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ వకాస్‌ (పాకిస్తానీ), మహ్మద్‌ తెహసీన్‌ అక్తర్‌ అలియాస్‌ మోను, ఎజాజ్‌ షేక్‌ పాలుపంచుకున్నారని ఎన్‌ఐఏ తేల్చింది. విధ్వంసంలో యాసీన్‌ భత్కల్‌ నేరుగా పాల్గొననందున అతణ్ని ఐదో నిందితుడిగా చేర్చింది.

దిల్‌సుఖ్‌నగర్‌లోని 107 బస్టాప్, ఏ–1 మిర్చి సెంటర్‌ వద్ద జరిగిన ఈ పేలుళ్లలో 18 మంది మరణించగా ఏకంగా 131 మంది క్షతగాత్రులవడం తెలిసిందే. దీనిపై హైదరాబాద్‌లోని మలక్‌పేట, అప్పటి సైబరాబాద్, ఇప్పటి రాచకొండ కమిషనరేట్‌లోని సరూర్‌నగర్‌ ఠాణాల్లో కేసులు నమోదవగా, అనంతరం వాటిని ఎన్‌ఐఏకు బదలాయించారు. ఈ రెండు కేసులకు కీలక ప్రాధాన్యమిచ్చిన ఎన్‌ఐఏ అధికారులు 157 మంది సాక్షులతో పాటు 502 డాక్యుమెంట్లు, 201 ఆధారాలను కోర్టు ముందుంచారు. నిందితులపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం 10, 16, 17, 19, 20, ఐపీసీ 120 (బి), 302, 307, 324, 326, 316, 121, 121 (ఎ), 122, 474, 466, పేలుడు పదార్థాల చట్టం 3, 5 సెక్షన్ల కింద ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. ఆరుగురు ఉగ్రవాదుల్లో ఐదుగురు దోషులుగా తేలగా, పాకిస్థాన్‌లో ఉన్న రియాజ్‌ భత్కల్‌పై ఇంటర్‌పోల్‌ రెడ్‌కార్నర్‌ నోటీసులు జారీ చేసింది.

దేశంలోనే తొలి కేసుగా రికార్డు
దేశవ్యాప్తంగా విధ్వంసాలకు పాల్పడటానికి ఆసిఫ్‌ రజా కమాండో ఫోర్స్‌గా (ఏఆర్‌సీఎఫ్‌) ఏర్పడిన ఉగ్రవాద బృందం ఆపై రియాజ్‌ భత్కల్‌ నేతృత్వంలో ‘ఉసాబా’గా పేరు మార్చుకుంది. 2002లో ఇండియన్‌ ముజాహిదీన్‌గా (ఐఎం) మారి తొమ్మిది రాష్ట్రాల్లో పదుల సంఖ్యలో పేలుళ్లకు పాల్పడింది. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, సూరత్, బెంగళూరు, వారణాసి... ఇలా వీరు విరుచుకుపడని మెట్రో, నగరం లేవు. 2007 ఆగస్టు 25న హైదరాబాద్‌లోని లుంబినీ పార్కు, గోకుల్‌ చాట్‌ల్లోనూ విధ్వంసం సృష్టించింది ఐఎం ఉగ్రవాదులే. 2007 నవంబర్‌ 25న వారణాసి కోర్టుల్లో పేలుడుకు పాల్పడిన ఈ ముష్కరులు పేలుడుకు బాధ్యత వహిస్తున్నట్లు మీడియాకు ఈ–మెయిల్‌ పంపారు. అప్పుడే తొలిసారిగా ఐఎం పేరు వెలుగులోకి వచ్చింది. ఈ సంస్థలో ఉన్నదెవరు, దాన్ని నడిపిస్తున్నదెవరనే అంశాలు మరో ఏడాది దాకా బయట పడలేదు. 2008 సెప్టెంబర్‌లో ఢిల్లీలోని జామియానగర్‌లో ఉన్న బాట్లా హౌస్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అక్కడ దొరికిన ముష్కరుల విచారణతో ఐఎం గుట్టు రట్టయింది. అంతకుముందు, ఆ తర్వాత దేశవ్యాప్తంగా జరిగిన విధ్వంసాలకు సంబంధించి ఐఎంపై 60 కేసులు నమోదయ్యాయి. పదుల సంఖ్యలో ఉగ్రవాదులు అరెస్టయ్యారు. 2007 నాటి హైదరాబాద్‌ జంట పేలుళ్లతో పాటు అన్ని కేసులూ పలు కోర్టుల్లో విచారణ దశల్లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో ఐఎం ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తై, నిందితులను దోషులుగా తేల్చిన తొలి కేసుగా దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు రికార్డుకెక్కాయి.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement