ఏడేళ్ల క్రితం తప్పిపోయిన కుమారుడిని గుర్తించిన తల్లిదండ్రులు
బహదూర్‌పురా: ఏడేళ్ల క్రితం కన్పించకుండా పోయిన ఆంజనేయులు తమ కుమారుడేనంటూ అంబర్‌పేటకు చెందిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. పోలీసుల కథనం ప్రకారం... 2003లో చార్మినార్ వద్ద తప్పిపోయిన ఆంజనేయులు అనే బాలుడు రెలైక్కి చెన్నై చేరుకొన్నాడు. అక్కడ అనుకోని విధంగా ఓ కేసులో ఇరుక్కొని జువైనల్ హోంలో మూడేళ్లు శిక్ష అనుభవించాడు. ఆత ర్వాత బయటకు వచ్చాక..ఎటు వెళ్లాలో తెలియక తనకు ఎవరూ లేరని చెప్పడంతో అధికారులు జువైనల్ హోంలోనే మరో నాలుగేళ్లు ఉంచారు. శిక్ష పూర్తయినా నాలుగేళ్లవరకు తల్లిదండ్రులు ఎవరూ రాకపోవడంతో స్పందించిన జడ్జి స్థానికంగా ఉన్న స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబుకు ఆ బాలుడి కుటుంబ వివరాలు తెలుసుకొని అప్పగించాలని పురమాయించారు. ఈ నేపథ్యంలో సదరు సంస్థ డిప్యూటీ డెరైక్టర్ స్పందించారు. బాలుడు ఆంజనేయులు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం హైదరాబాద్‌లోని చార్మినార్ ప్రాంతానికి చేరుకొని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆతర్వాత ఆయన చుట్టుపక్క ప్రాంతాల్లో ఆరా తీసినా ఏమీ తెలియకపోవడంతో ఆంజనేయులుని తీసుకొని చెన్నైకి వెళ్లి పోయాడు.
ఈ క్రమంలో తల్లిదండ్రుల కోసం తపిస్తున్న బాలుడి ఫొటో పత్రికల్లో ప్రచురితం కావడంతో దాన్ని చూసిన శివ, అంజమ్మ దంపతులు మంగళవారం చార్మినార్ పోలీసులను సంప్రదించారు. 2003లో తమ కుమారుడు ఆంజనేయులు తప్పిపోయినట్లు అప్పట్లో చార్మినార్ పోలీసు స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు (ఎఫ్‌ఐఆర్) కాపీని చూపడంతో పాటు బాలుడి చేతిపై ‘శ్రీ’ పచ్చబొట్టు గుర్తు ఉన్నట్లు చెప్పారు. ఆనవాళ్లన్నీ సరిగ్గా సరిపోవడంతో నిర్థారించుకొన్న పోలీసులు విషయాన్ని చెన్నైలోని స్కోప్ ఇండియా స్వచ్ఛంద సంస్థకు సమాచారం అందించారు. దీంతో ఆ సంస్థ డిప్యూటీ డెరైక్టర్ సత్తిబాబు ఈ నెల 11న ఆంజేయులును తీసుకొని హైదరాబాద్ వస్తున్నటు తెలిపారని చార్మినార్ ఇన్‌స్పెక్టర్ యాదగిరి వెల్లడించారు.
అవును..మా అబ్బాయే
Published Wed, Jun 10 2015 12:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM
Advertisement
Advertisement