ఊహల్లో..ఊగిసలాట
- ప్రేమ పేరుతో మోసపోతున్న టీనేజర్లు
- క్షణికావేశంలో ఆత్మహత్యలు
సాక్షి,సిటీబ్యూరో: ఆధునిక ప్రపంచంలో యువత జీవితం ఊహల్లో ఊగిసలాటగా మారుతోంది. ఉన్నత విద్యావంతులుగా, ఉత్తమ పౌరులుగా ఎదగాల్సిన టీనేజర్లు ఊహా ప్రపంచంలో విహరిస్తూ విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఆకర్షణకు, ప్రేమకు మధ్య తేడాను తెలుసుకోలేక ప్రేమ పేరుతో దారుణంగా మోసపోతున్నారు. అనంతరం ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
నగరంలో చోటుచేసుకుంటున్న ఇలాంటి ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బుధవారం నాగార్జునసాగర్‌లో ఆత్మహత్యకు పాల్పడిన అనూష ఉదంతం కూడా ఇంచుమించు ఇలాంటిదే. తన కంటే వయస్సులో చాలా పెద్దవాడు, అప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని, తనను అత్యంత దారుణంగా మోసం చేశాడనే విషయం తెలియగానే తీవ్ర నిరాశ నిస్పృహలకు గురైంది. నాగార్జునసాగర్‌లో దూకి ఆత్మహత్యకు ఒడిగట్టింది. నగరంలో ఎక్కడో ఒక చోట తరచుగా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.
ఏడాది క్రితం నగరానికే చెందిన గౌతమీప్రియ ఆత్మహత్య చేసుకొని తనువు చాలించింది. తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తి, అతడి కుటుంబ సభ్యుల్లాంటివారిని అంతకు ముందు ఎప్పుడూ ఎక్కడా చూడలేదని సూసైడ్ నోట్ రాసింది. చిన్న వయస్సులోనే జీవితంపై విరక్తి చెందినట్లు పేర్కొంది. అలాగే కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన భవానీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. ఇలాంటి సంఘటనల వెనుక శారీరకమైన ఆకర్షణలు తప్ప మానసికమైన ప్రేమలు, అనుబంధాలు ఏ మాత్రం కనిపించడం లేదని మానసిక వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
వయా సోషల్ మీడియా..
ఆకర్షణననే ప్రేమగా భావించి ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ’ అనే భ్రమలో పడి మోసపోతున్న యువత సోషల్ మీడియానే వేదికగా చేసుకొని మరింత మోసానికి గురవుతోంది. నాలుగు రోజుల క్రితం నగరానికి చెందిన ఓ అమ్మాయి ఫేస్‌బుక్‌లో పరిచయమైన ఒక వ్యక్తి చేతిలో ఇలాగే మోసానికి గురైంది. అనకాపల్లిలో మెకానిక్‌గా పని చేసే యువకుడు అమెరికాలో ఉంటున్నట్లుగా ఫేస్‌బుక్‌లో పరిచయం చేసుకున్నాడు. ఇద్దరు హైదరాబాద్‌లో కలిసే నాటికి అతడి వంచన తెలిసింది. కానీ అప్పటికే అతనితో ప్రేమలో (ఆకర్షణ)లో పడిన ఆ అమ్మాయి అతనితోనే రాజీ పడేందుకు సిద్ధపడడం గమనార్హం. సినిమాలు, సాహిత్యం, మీడియా ఇలాంటి చర్యలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. దీంతో స్నేహసంబంధాలను, మానవ సబంధాలను బలోపేతం చేయవలసిన సోషల్ మీడియా టీనేజ్ యూత్ పాలిట శాపంగా, ఆత్మహత్యాసదృశ్యంగా పరిణమిస్తోంది.
వాస్తవాలను అర్థం చేసుకోవాలి
యుక్త వయస్సులో వచ్చే మానసిక ఆలోచనలను అర్థం చేసుకోవడంలో టీనేజర్లు విఫలమవుతున్నారు. ఊహాలోకంలో తేలిపోతూ బయటకు రాలేకపోతున్నారు. తమది ప్రేమ కాదని తెలిసినా, అది కేవలం ఆకర్షణ మాత్రమే ననే విషయం అర్థమవుతున్నప్పటికీ బయటపడేందుకు సాహసం చేయలేకపోతున్నారు. వాస్తవ ప్రపంచంలోకి రాలేక మోసపోతున్నారు. వాస్తవ లోకంలోకి వచ్చి కెరీర్‌పై దృష్టి సారించాలి. కుటుంబం, సమాజం కూడా పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించాలి.
- డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి,మానసిక వైద్య నిపుణులు