ఏవోబీ ఎన్ కౌంటర్ పై వైఎస్ఆర్ సీపీ ప్రకటన
హైదరాబాద్ : ఈ నెల 24న ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్ ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఓ ప్రకటన చేసింది. ఏవోబీ ఎన్కౌంటర్పై విచారణకు ఆదేశించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తీవ్రవాదానికి వైఎస్ఆర్ సీపీ వ్యతిరేకమని, ఏ పోరాటమైనా శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా జరగాలన్నారు.
మల్కన్ గిరి, బలిమెల ఎన్కౌంటర్లపై మీడియా, ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని ఆమె అన్నారు. ఎన్కౌంటర్ వాస్తవం కాదనే అభిప్రాయం బలంగా వినిపిస్తోందని... అయితే డీజీపీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇది ఖచ్చితంగా ఎన్కౌంటరే అని చెబుతోందని వాసిరెడ్డి పద్మ అన్నారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరగాలని ఆమె డిమాండ్ చేశారు. అందరూ కోరుకున్నట్టుగా రాష్ట్రప్రభుత్వం విచారణకు ఆదేశించాలని వాసిరెడ్డి పద్మ అన్నారు. కాగా ఎన్కౌంటర్లో 30మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.