
గుట్టు రట్టవుతుందనే టీడీపీ రచ్చ
బొండా.. నోరు అదుపులో పెట్టుకో..
వైఎస్సార్ సీపీ సీనియర్ నేత హెచ్‌ఎ. రెహమాన్
సుల్తాన్‌బజార్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అక్రమాలు బయటపడతాయనే టీడీపీ సభ్యులు జులుం ప్రదర్శిస్తున్నారని, టీడీపీని ప్రజలే గద్దెదింపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రధాన కార్యదర్శి హెచ్‌ఎ రెహమాన్ అన్నారు. గురువారం కింగ్‌కోఠిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నిస్తుండగా...టీడీపీ గుట్టు రట్టువుతుందనే భయంతో ఆయనను అడ్డుకున్నారన్నారు. టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడి డెరైక్షన్‌లో చర్చను పక్కతోవ పట్టించేందుకు వారి జులుంను అసెంబ్లీ సాక్షిగా ప్రదరిస్తున్నారని, ప్రజలు దీన్ని గమనిస్తున్నారని అన్నారు.
విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమమహేశ్వరరావు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని, అనవరసంగా తమ ఎమ్మెల్యేలపై అవాకులు చవాకులు పేలితే ఊరుకునేది లేదని రెహమాన్ హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే హైదరాబాద్‌లో అడుగుపెట్టనివ్వమన్నారు. బొండాకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి విజయవాడ సెంట్రల్‌లో మళ్లీ పోటీ చేయాలని ఆయన సవాల్ విసిరారు. చంద్రబాబు తొమ్మిది నెలల పాలనతోనే ప్రజలు విసిగి వేసారిపోయారని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో పూర్తిచేయకుంటే చంద్రబాబుకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.