
ప్రజా నాయకుడెలా ఉండాలో చూపారు
- ప్రజారంజక పాలన అందించారు
- అందుకే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు
- కొనియాడిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి
- వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్‌కు నేతల నివాళి
సాక్షి, హైదరాబాద్: ‘‘ఒక ప్రజానాయకుడు, పరిపాలకుడు, ముఖ్యమంత్రి ఎలా ఉండా లో.. ఎలా పరిపాలించాలో చేసి చూపించిన మహానాయకుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. దేశం మొత్తానికే ఆదర్శనీయమైన ముఖ్యమంత్రిగా నిలిచిన వ్యక్తి ఆయన’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి కొనియాడారు. వైఎస్సార్ ఏడవ వర్థంతిని పురస్కరించుకుని శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మేకపాటితోపాటు పార్టీ ముఖ్యనేతలు, కార్యకర్తలు మహానేతకు ఘనంగా నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ అమర్హ్రే, జై జగన్’ నినాదాలు మార్మోగాయి.
అనంతరం మేకపాటి ప్రసంగిస్తూ.. ప్రజలు అంతకుముందెన్నడూ ఊహించని విధంగా వైఎస్ తన పాలనలో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు. సమాజంలోని వారందరికీ అన్నిరకాల భద్రతను చేకూర్చేందుకు కృషిచేసిన మహనీయుడు కనుకనే ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా, చిరంజీవిగా నిలిచిపోయారన్నారు. మన బిడ్డలను ప్రభుత్వమే చదివిస్తుందనిగానీ, మన ఆరోగ్యాన్ని ప్రభుత్వమే కాపాడుతుందనిగానీ అంతకుముందు ప్రజలెన్నడూ ఊహించనైనా లేదన్నారు. ప్రజారంజకమైన పాలన అందించారు కనుకనే.. ఉభయరాష్ట్రాల్లోని తెలుగువారేగాక దేశ, విదేశాల్లోని తెలుగువారు సైతం వైఎస్‌ను స్మరించుకుంటున్నారన్నారు.
కర్నూలు ఎంపీ బుట్టా రేణుక మాట్లాడుతూ.. యువకులు, విద్యార్థులు, రైతులు, మహిళలు ఇలా అన్ని వర్గాల ప్రజలూ అభివృద్ధి చెందేలా గొప్ప పరిపాలనను వైఎస్ తెలుగు రాష్ట్రాలకు అందించారన్నారు. వైఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు యావత్‌దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి కొనియాడారు. తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ దేవుని ఫొటో పక్కన వైఎస్ ఫొటోను పెట్టుకున్నారన్నారు. ప్రధాన కార్యదర్శి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ తాను పెద్దమ్మ గుడికెళ్లి వైఎస్ పేరిట పూజలు చేసి బయటికొస్తుంటే నలుగురు వృద్ధులు ఎదురై.. వైఎస్ ఉండగా తమకు పింఛన్‌లు వచ్చేవని, కేసీఆర్ వచ్చాక వాటిని తొలగించారని భోరుమని విలపించినపుడు కలత చెందానన్నారు. ప్రతి ఇంటికీ మేలు చేసిన వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉంటే అది వైఎస్ మాత్రమేనని పార్టీ ప్రధాన కార్యదర్శి ఎన్.లక్ష్మీపార్వతి అన్నారు. వైఎస్ జీవించి ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొని ఉండేది కాదన్నారు. ఆ మహానేతను జగన్‌లో చూసుకుంటూ ముందుకు నడవాలని, వైఎస్ ఆదర్శాల్ని నెరవేర్చగలిగేది జగనేనని అన్నారు. కార్యక్రమంలో జగన్ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ముఖ్యనేతలు వాసిరెడ్డి పద్మ, పీఎన్వీ ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ సహా పలువురు పాల్గొన్నారు.
ప్రజల మనిషి వైఎస్: ఉమ్మారెడ్డి
ఒక నాయకుడు మరణించినపుడు తట్టుకోలేక కొన్ని వందల మంది మృతిచెందిన సంఘటన గతంలో ఎన్నడూ జరుగలేదంటే ఎంతగా వైఎస్ ప్రజల్లో నిలిచిపోయారో అర్థమవుతోందని ఏపీ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. ప్రజల అవసరాలు, వారి ఆకాంక్షలకు అనుగుణంగా పాలించిన నేత వైఎస్ అన్నారు. తనపై ఎన్ని ఆరోపణలొచ్చినా వెరవకుండా సీబీఐ దర్యాప్తుకైనా, మరెలాంటి విచారణకైనా సిద్ధమేనని నిలబడ్డ నేత వైఎస్ అని, ఈనాడున్న పాలకుల మాదిరిగా ఆరోపణలపై విచారణ జరక్కుండా స్టేలు తెచ్చుకునేందుకు ఏనాడూ పాకులాడలేదని అన్నారు.