- రాష్ట్ర స్థాయి ఉద్యోగులుగా కానిస్టేబుళ్లు, ఎస్సైలు
- నియామక పద్ధతులు మార్చాలని నిర్ణయం
- విభేదిస్తున్న సీనియర్ ఐపీఎస్‌లు
సాక్షి, హైదరాబాద్: పోలీస్ శాఖలో జోన్ల రద్దు సంక్షోభం మొదలైంది. రాష్ట్రంలో జోన్ల విధానాన్ని రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో పోలీస్ శాఖ ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రస్తుతం పోలీస్ శాఖలో జిల్లా కేడర్‌లో ఉన్న కానిస్టేబుళ్లు, రేంజ్ కేడర్‌గా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్లు, జోన్ల వారీగా ఉన్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు.. ఇక రాష్ట్ర కేడర్ ఉద్యోగులుగా మారనున్నారు. అయితే ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఇటీవల కీలక భేటీ నిర్వహించింది. ఇందులో ఒక్కో ఐపీఎస్ అధికారి ఒక్కో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎక్కువ శాతం ఐపీఎస్ అధికారులు కానిస్టేబుళ్లను రాష్ట్ర ఉద్యోగులుగా మార్చడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. దీని వల్ల శాంతి భద్రతల సమస్యలు, సీనియారిటీ వ్యవహారం, పదోన్నతులు, బదిలీల వ్యవçహారాల్లో ఇబ్బందులొస్తాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కేడర్‌గా గుర్తించే వ్యవహారాన్ని విభేదిస్తున్నట్లు తేల్చిచెప్పారు.
రాష్ట్ర స్థాయితో ప్రయోజనం?
జిల్లా పరిధిలోనే పనిచేసేలా కానిస్టేబుళ్ల ఎంపిక జరుగుతుంది. అవసరమైతే డిప్యూటేషన్‌పై ప్రత్యేక విభాగాలకు బదిలీ చేసేవారు. అయితే ఎక్కువ కాలం ఒకే ప్రాంతంలో పనిచేయడం వల్ల పోలీస్‌స్టేషన్లలో ఎస్సైలను, ఇన్‌స్పెక్టర్లను లెక్కచేయట్లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కానిస్టేబుళ్ల వ్యవహారంపై ఇటీవల ఏకంగా కేబినెట్ భేటీలో సీనియర్ మంత్రి సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. ఒకే జిల్లాలో పనిచేయడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని, వీరి వల్లే ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ప్రతి పోస్టును రాష్ట్ర కేడర్‌గా పరిగణించాలని, జోన్ల రద్దులో ఈ విషయాన్ని చేర్చాలని డీజీపీని ఆదేశించినట్లు తెలిసింది.
ఎక్కడి నుంచి ఎక్కడికైనా..
రాష్ట్ర కేడర్‌కు మారితే జిల్లా కేడర్‌కు చెందిన కానిస్టేబుల్ కానీ, రేంజ్ కేడర్‌కు చెందిన ఎస్సై కానీ అవినీతికి పాల్పడితే రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు పనిష్మెంట్ కింద బదిలీ చేయొచ్చు. దీంతో వారి ఆగడాలకు అడ్డుకట్ట వేయొచ్చనేది ఓ వాదన. జిల్లాల విభజనకు ముందు రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్ రెండు జోన్లు, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్ నాలుగు రేంజ్‌లుండేవి. ఒక్కో రేంజ్ కింద 2 జిల్లాల యూనిట్లు ఉంటాయి. ఎస్‌ఐలను ఈ జిల్లాల పరిధిలోనే బదిలీ చేసే అవకాశం ఉండేది. పాత జిల్లాల ప్రకారం వరంగల్ జోన్ కింద 4, హైదరాబాద్ జోన్ కింద 5 జిల్లాలుండేవి. హైదరాబాద్, సైబరాబాద్ కూడా హైదరాబాద్ జోన్ కిందకు వచ్చేవి.
ఎస్సైలకు గెజిటెడ్ హోదా!
ఎస్సైలను రాష్ట్ర కేడర్‌గా గుర్తించడంలో పెద్దగా సమస్యలేవీ కన్పించడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఒకే సీనియారిటీ లిస్ట్‌ను బ్యాచ్‌ల వారీగా పాటిస్తే ఇబ్బంది లేదని ఎస్సైలు చెబుతున్నారు. అయితే తమకు గెజిటెట్ హోదా కల్పిçస్తూ రాష్ట్ర కేడర్ చేస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. ఇన్‌స్పెక్టర్ల విషయంలో మాత్రం కోర్టుకెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. జోన్ల వారీగా ఉన్న తమకు పదోన్నతులు, సీనియారిటీలో న్యాయం జరగలేదని, రాష్ట్ర కేడర్‌గా చేస్తే సమస్య మరింత జఠిలమవుతుందని ఇన్‌స్పెక్టర్లు పేర్కొంటున్నారు. బ్యాచ్‌ల వారీగా కాకుండా సీనియారిటీ పేరుతో వరంగల్ జోన్‌లో ఉన్న వారికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తం చేస్తే మూకుమ్మడి సెలవులో వెళతామని, డీజీపీ సహా ఉన్నతాధికారులకు ఫిర్యాదుచేశారు.
అభ్యంతరాలు పరిశీలిస్తాం
జోన్ల రద్దుపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించాం. జోన్ల రద్దు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. జోన్ల రద్దు, రాష్ట్ర కేడర్ ఉద్యోగుల లాభ నష్టాలపై అధ్యయనం చేస్తున్నారు. కానిస్టేబుళ్ల విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. వారిని రాష్ట్ర కేడర్ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు వారి బదిలీలు, పదోన్నతుల విషయంలో మాత్రం రేంజ్ వరకే పరిమితి చేయాలనే ఆలోచనను చాలా మంది ఐపీఎస్‌లు వ్యక్తంచేశారు. దీనిపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.
– డీజీపీ అనురాగ్‌శర్మ