'పేకాట గొడవ.. పేలిన తుపాకి'
అట్లాంటా: అమెరికాలో మరోసారి గన్ పేలింది. ఓ బార్ షాపులో గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో దాదాపు పదిమంది గాయాలపాలయ్యారు. జార్జియా టౌన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నైరుతి ఆట్లాంటాలోని జార్జియా పట్టణంలోగల హిల్ హవెన్ సెంటర్లోని బార్కు భారీ సంఖ్యలో జనం వచ్చారు.
వారంతా అందులో సరదాగా గడుపుతుండగా ఒక్కసారిగా తుపాకీ చప్పుళ్లు వినిపించాయి. ఏం జరుగుతుందో తెలిసేలోగా పదిమంది తీవ్ర గాయాలపాలయ్యారు. గాయపడిన వారంతా కూడా 16 నుంచి 29 ఏళ్ల లోపువారే. వీరిలో ఐదుగురు మహిళలు కూడా ఉన్నారు. అయితే, ఈ బార్ వెనుక చట్ట వ్యతిరేకంగా పేకాట జరుగుతుండగా అక్కడ గొడవ జరిగి అనంతరం కాల్పులకు దారి తీసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.