
బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఐఎస్ లో చేరేందుకు మైనర్ యత్నం!
కౌలాలంపూర్: ఐఎస్ ఉగ్రవాదుల కార్యకలాపాలు ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఇస్లామిక్ రాజ్య స్థాపనే లక్ష్యంగా పేట్రేగిపోతున్న ఐఎస్ ఉగ్రవాదుల పన్నిన వలలో అటు పెద్దల నుంచి మైనర్లు కూడా ఆకర్షితులవ్వడం ఆందోళన రేకెత్తిస్తోంది. తాజాగా 14 ఏళ్ల మైనర్ బాలిక ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ లో చేరడానికి సిద్ధమవుతూ పోలీసులకు చిక్కింది. మంగళవారం మలేషియాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
దక్షిణ మలేషియాకు చెందిన ఆ బాలిక ఎయిర్ పోర్ట్ లో ఐఎస్ టెర్రర్ గ్రూపులో జాయిన్ అయ్యేందుకు యత్నిస్తూ స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు పట్టుబడింది. దీంతో పాటుగా మలేషియాకు చెందిన 22 ఏళ్ల యువకుడ్ని ఆ బాలిక పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుందని.. అనంతరం వారిద్దరూ కలిసి ఐఎస్ లో చేరేందుకు సన్నద్ధమైనట్లు పోలీస్ అధికారి ఖలిద్ అబు బకార్ తెలిపారు. ఇప్పటికే సిరియా లో ఉంటున్న ఇద్దరు మలేషియన్ మిలిటెంట్లతో ఆ యువతి టచ్ లో ఉంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ బాలికను అదుపులో తీసుకుని తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నామన్నారు. ఇంకెరైనా ఐఎస్ టెర్రర్ గ్రూపులో చేరడానికి ఆ బాలిక సహాయ సహకారాలు అందించిందా? అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నామన్నారు.