ప్రపంచ దేశాల హెచ్చరికలు బేఖాతరు చేస్తూ.. ఉత్తర కొరియా ఇటీవల హైడ్రోజన్ బాంబును పరీక్షించిన సంగతి తెలిసిందే. హైడ్రోజన్ బాంబు పరీక్ష సందర్భంగా సమీపంలోని ఓ సొరంగం కుప్పకూలి.. 200 మంది చనిపోయినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఉత్తర కొరియా ఈశాన్య ప్రాంతమైన పంగ్యే-రీ ప్రాంతంలో గత నెల కిమ్ జాంగ్ ఉన్ సర్కారు హైడ్రోజన్ అణుబాంబు పరీక్షించింది. కొరియా చేపట్టిన ఆరో అణ్వాయుధ పరీక్షల్లో భాగంగా సెప్టెంబర్ 3న దాదాపు వందకిలోల హైడ్రోజన్ బాంబ్‌ను పేల్చింది. అత్యంత శక్తిమంతమైన ఈ పేలుడు ధాటికి ఆ దేశం పెద్ద మూల్యమే చెల్లించుకుంది. పేలుడు ధాటికి పరీక్ష జరిగిన ప్రాంతమంతా తీవ్ర ప్రభావానికి లోనై.. సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం కుప్పకూలిందని జపాన్‌కు చెందిన ఆసహి టీవీ చానెల్ తెలిపింది.
ఈ ప్రమాదంలో సొరంగం నిర్మాణంలో పాలుపంచుకుంటున్న వందమంది కార్మికులు చనిపోయారని మొదట భావించారని, కానీ, సహాయక చర్యలు ముగిసిన తర్వాత మృతుల సంఖ్య 200కు చేరుకుందని తేలిందని కొరియా వర్గాలను ఉటంకిస్తూ ఆ చానెల్ వెల్లడించింది. 1945లో హిరోషిమాపై అమెరికా వేసిన అణుబాంబు కంటే ఏడురెట్లు పెద్దదైన ఈ హైడ్రోజన్ బాంబు పరీక్ష వల్ల అక్కడి భూభాగం మెత్తబడి ఈ ప్రమాదం చోటుచేసుకొని ఉంటుందని భావిస్తున్నారని ఆ చానెల్ పేర్కొంది. అత్యంత శక్తివంతమైన ఈ హైడ్రోజన్ బాంబు పేలుడుతో ఆ ప్రాంతంలోని పర్వతం అడుగుభాగంలో 60 నుంచి 100 మీటర్ల అగ్నిగుండం ఏర్పడిందని కొరియా వాతావరణశాఖ ఇప్పటికే వెల్లడించింది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో మరిన్ని అణుబాంబు పరీక్షలు నిర్వహిస్తే.. వాతావరణంలోకి రేడియోధార్మిక కణాలు లీక్ అయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
షాకింగ్: 'అణు' పేలుడు.. 200 మంది మృతి!
Published Tue, Oct 31 2017 5:56 PM | Last Updated on Tue, Oct 31 2017 6:11 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment