
22 మంది అరబ్ సైనికులు హతం
ప్రజలు కట్టుబట్టలతో దేశం విడిచి, శరణార్థులుగా సముద్రాలు దాటే క్రమంలో ప్రాణాలు కోల్పోతున్నా.. యెమెన్లో అధికారం కోసం అంతర్యుద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా హుతీ దళాలు జరిపిన మెరుపదాడిలో తమ దేశానికి చెందిన 22 మంది సైనికులు మరణించినట్లు యూఏఈ శుక్రవారం ప్రకటించింది. యెమెన్లో హుతీ తిరుగుబాటు దళాలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా నేతృత్వంలో పలు దేశా సైనికులు యుద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే.
సెంట్రల్ మరిబ్ ప్రాంతంలోని ఓ క్యాంపులో సౌదీ దళాలు ఉన్నట్లు గుర్తించిన తిరుగుబాటుదారులు.. ఆ క్యాంపుపై రాకెట్ లాంచర్లతో దాడికి తెగబడ్డారు. క్యాంపులో భారీ ఎత్తున మందుగుండు సామగ్రి నిల్వ ఉండటమే మృతుల సంఖ్య పెరగడానికి కారణమయింది. దాడిలో పలువురు యెమెన్ సైనికులు కూడా మరణించారు. పెద్దసంఖ్యలో సైనిక వాహనాలు, నాలుగైదు హెలికాప్టర్లు కూడా ధ్వంసమైనట్లు తెలిసింది.
గత ఏడాది సెప్టెంబర్లో హుతీ తిరుగుబాటు దళాల చేతిలో పదవీచ్యుతుడై దేశం విడిచి పారిపోయిన సిరియా మాజీ అధ్యక్షుడు అబెబ్ రబ్బూ మన్సూర్ హదీ.. ప్రస్తుతం సౌదీ అరేబియాలో ఆశ్రయం పొందుతున్నాడు. అతడికి మళ్లీ అధికారాన్ని కట్టబెట్టేందుకు పది సున్నీ ముస్లిం దేశాలు నడుం కట్టాయి. ఆ క్రమంలోనే సౌదీ అరేబియా నేతృత్వంలో పలు సున్నీ దేశాలు కలిసి ఈ ఏడాది మార్చిలో నూతన సైన్యంగా ఏర్పడి హుతీ తిరుగుబాటుదారులతో పోరాడుతున్నాయి.
సిరియాలోని ప్రభుత్వ సైన్యాలు కూడా వీరిని అనుసరిస్తూ ఉన్నాయి. కాగా, తిరుగుబాటుదారులైన హుతీలు షియాలు కావడంతో వారికి ఇరాన్ మద్దతునిస్తోంది. ఈ పోరులో గతంలో ఓ సారి ఐదుగురు జవాన్లను పోగొట్టుకున్న యూఏఈ.. ఇప్పుడు భారీ సంఖ్యలో 22 మంది సైనికులను పోగొట్టుకుంది.