
22 వేల మంది ఐసిస్ టెర్రరిస్టుల వివరాలు వెలుగులోకి..
లండన్: సిరియా, ఇరాక్ దేశాల్లో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులకు వ్యతిరేకంగా యూరప్ సాగిస్తున్న పోరాటంలో బ్రిటన్ ఇంటలిజెన్స్ విభాగం అద్భుత విజయాన్ని సాధించింది. 22 వేల మంది టెర్రరిస్టులకు సంబంధించిన వ్యక్తిగత, కుటుంబ వివరాలతో కూడిన రహస్య డాక్యుమెంట్లను టెర్రరిస్టుల నుంచి చేజిక్కించుకుంది. ఐఎస్‌ఐఎస్ రిక్రూట్‌మెంట్ సందర్భంగా అందులో చేరే అభ్యర్థులు స్వచ్ఛందంగా నింపిన రిజిస్టర్ ఫామ్స్‌కు సంబంధించిన ఈ డాక్యుమెంట్లను ఐఎస్‌ఐఎస్ అసమ్మతి జిహాది ఒకరు లీక్ చేశారు.
23 ప్రశ్నలతో కూడిన ఆ ఫామ్స్‌లో వ్యక్తిపేరు, తల్లి ఇంటి పేరు, పుట్టిన తేదీ, పుట్టిన స్థలం, దేశం పేరు, టెలిఫోన్ నెంబరు, ఇంతకు ముందు ఏయే ఉద్యోగాలు చేసినదీ, ఇంతకు ముందు పోరాడిన అనుభవం ఉందా, షిరియా లాను ఎంతవరకు చదువుకుందీ, ఏ మేరకు అర్థం చేసుకున్నదీ, రిక్రూట్‌మెంట్‌కు సిఫారసు చేసిన ఐఎస్‌ఐఎస్ తీవ్రవాది ఎవరు, ఐఎస్‌ఐఎస్‌లో చేరి ఏ తీరుగా పోరాడాలనుకుంటున్నది, ఏ రోజున, ఏ ప్రాంతంలో చావాలనుకుంటున్నది, ఏయే దేశాల గుండా సిరియా, ఇరాక్ దేశాలకు వచ్చిందీ, ఏ ప్రాంతం గుండా వచ్చిందీ, సమీప బంధువులు ఎవరు, వారి వివరాలేమిటీ అన్న ప్రశ్నలు ఉన్నాయి. టెర్రరిస్టులుగా చేరిన అభ్యర్థులు చాలా మంది దేశం పేరు, చనిపోవాలనుకుంటున్న తేదీ లాంటి వివరాలు తప్ప దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
ఏకంగా ఒకేసారి 22 వేల మంది టెర్రరిస్టుల వివరాలు లభించడమంటే బంగారు గని లభించడం లాంటిదేనని బ్రిటన్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్‌లు వ్యాఖ్యానించారు. ఈ వివరాలను బట్టి వారు ఎక్కడ ఉన్నా పట్టుకోవచ్చని వారు భావిస్తున్నారు.
ఆ డాక్యుమెంట్లలో 16 మంది బ్రిటీష్ టెర్రరిస్టుల వివరాలతోపాటు 51 దేశాలకు చెందిన ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టుల వివరాలు ఉన్నాయి. బ్రిటన్‌కు చెందిన వారిలో బర్మింగమ్‌కు చెందిన కంప్యూటర్ హ్యాకర్ జునాయిద్ హుస్సేన్, కార్డిఫ్‌లో పుట్టిన రెయాద్ ఖాన్‌ల వివరాలు కూడా ఉన్నాయి. వారిద్దరు గతేడాది అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో మరణించారు. సౌదీ అరేబియాకు చెందిన వారు 485 మంది, టునీషియాకు చెందిన వారు 375 మంది, మొరక్కోకు చెందిన వారు 140 మంది, ఈజిప్టుకు చెందిన వారు 101 మంది, ఫ్రాన్స్‌కు చెందిన వారు 35 మంది, బ్రిటన్‌ను చెందిన వారు 16 మంది, అమెరికాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. ఇక లెబనాన్, బెల్జియం, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, రష్యా, అఫ్ఘానిస్తాన్ దేశాల నుంచి 126 మంది ఉన్నారు.
2012-2013లో ఐఎస్‌ఐఎస్‌లో చేరి అనతికాలంలోనే కరడుగట్టిన టెర్రరిస్టులుగా ముద్రపడిన వారందరి పేర్లు వాటిలో ఉన్నాయి. వారిలో కొందరు ఇప్పటికే చనిపోగా మిగతా వారు ఐఎస్‌ఐఎస్ కార్యకలాపాల్లో ఉన్నారు. కొంతమంది బీభత్సం సృష్టించేందుకు ఇప్పటికే యూరప్‌లోకి ప్రవేశించారు. టెర్రరిస్టులు వెతికి పట్టుకొని నిర్మూలించేందుకు ఈ డాక్యుమెంట్లు ఎంతో ఉపయోగపడతాయని యూరప్ సైనిక వర్గాలు భావిస్తున్నాయి.