చాద్లో జంట పేలుళ్లు: 25 మంది మృతి
ఎన్'డిజమెనా: మధ్య ఆఫ్రికా దేశం చాంద్ సోమవారం పేలుళ్లతో దద్దరిల్లింది. రాజధాని నగరం ఎన్'డిజమెనాలో ఉగ్రవాదులు జరిపిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 25 మంది మరణించగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మోటార్ బైకుపై దూసుకొచ్చిన ఉగ్రవాది.. సెంట్రల్ పోలీస్ స్టేషన్ ప్రధాన ద్వారం వద్ద తనను తాపు పేల్చుకున్నాడని, ఇక్కడికి సమీపంలోని పోలీస్ స్కూలు వద్ద కూడా ఇదే తరహాలో ఆత్మాహుతి దాడి జరిగిందని పోలీసులు చెప్పారు.
రెండు ఘటనల్లో 25 మంది మృతిచెందగా, పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడ్డారని, వారిని సమీప ఆసుపత్రులకు తరలించామని తెలిపారు. సంఘటనా స్థలానికి కూతవేటు దూరంలోనే చాంద్ అధ్యక్ష భవనం, ఫ్రాన్స్ రాయబార కార్యాలయం ఉండటం గమనార్హం. కాగా, చాంద్లో ఈ తరహా దాడి జరగటం ఇదే మొదటిసారి. ఐఎస్ఐఎస్ నైజీరియా శాఖగానీ, బొకో హరామ్ ఉగ్రవాద సంస్థగానీ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.