సాక్షి, న్యూఢిల్లీ : వివిధ రకాల నేరాలు చేసి జైలు శిక్ష అనుభవిస్తున్న భారతీయ ఖైదీలు సందు దొరికితే చాలు జైలు నుంచి పారిపోదామని చూస్తారు. మరికొందరు సందు దొరక్కపోయినా గోడలకు కన్నం వేసి మరీ పారిపోదామని వ్యూహాలు పన్నుతుంటారు. ఇండోనేసియాలోని పపువా ప్రాంతంలోని సొరాంగ్ నగరంలోని జైలులో సోమవారం మంటలు వ్యాపించడంతో జైలు నుంచి పారిపోయిన 500 మంది ఖైదీలు పారిపోయారు. వారిలో 270 మంది ఖైదీలు గురువారం తిరిగి జైలుకు చేరుకున్నారు. అలా తిరిగొచ్చిన వారిలో హత్య కేసుల్లో శిక్షలు పడ్డ వారు కూడా ఉన్నారని జైలు అధికార ప్రతినిధి ఎల్లి యోజర్ మీడియాకు తెలిపారు. వారంతా ప్రాణ రక్షణ కోసమే జైలు నుంచి పారిపోయారని, మిగతా శిక్షకాలాన్ని పూర్తి చేసుకునేందుకు తిరిగొచ్చారని ఆయన చెప్పారు.
ఏదో అంశంపై ఆందోళన చేస్తున్న పపువా విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆగ్రహించిన మిగతా విద్యార్థులు, స్థానికులు సొరాంగ్ నగరం జైలుకు నిప్పుపెట్టారు. ఖైదీలతో కిక్కిరిసిపోవడం వల్ల జైలు పరిశుభ్రంగా ఏమీ ఉండదని, అయితే తాము ఖైదీలను బాగా చూసుకుంటామని అందుకనే వారంతా తిరిగొచ్చారని ఎల్లీ యోజర్ తెలిపారు. బయట ఆహారం దొరక్కా జైలుకొచ్చే ఖైదీలు ఇంకా ఎక్కడైనా ఉండవచ్చేమోగానీ తమ వద్ద మాత్రం అలాంటి ఖైదీలు లేరని చెప్పారు. శిక్షాకాలం పూర్తి కాకుండా పారిపోవడం వల్ల ప్రయోజనం ఉండదని, అపరాధభావం, భయం జీవితాంతం వెంటాడుతుందని, శిక్షాకాలం పూర్తయ్యాక దర్జాగా సాధారణ జీవితం గడపొచ్చని తాము ఎప్పుడూ చెబుతుంటామని ఆయన అన్నారు.
తిరిగొచ్చిన ఖైదీలు కాలిపోయిన జైలు అధికారుల గదులను శుభ్రం చేయడమే కాకుండా మరమ్మతుల్లో కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారని, అధికారుల మంచితనానికి వారూ మంచితనమే చూపారని ఎల్లి యోజర్ వ్యాఖ్యానించారు. మిగతా ఖైదీలు కూడా తమ బంధు, మిత్రుల యోగ క్షేమాలు కనుగొని ఒకటి, రెండు రోజుల్లో తిరిగొస్తారని తాము ఆశిస్తున్నామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment