
అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం
వాషింగ్టన్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. పోలీసు చర్యలకు వ్యతిరేకంగా డల్లాస్లో చేపట్టిన నిరసన ర్యాలీ హింసాత్మకంగా మారింది. ఈ ఘటనలో ఐదుగురు పోలీసు అధికారులు మరణించగా, మరో పదిమంది తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. దాడికి పాల్పడినట్టుగా భావిస్తున్న ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నాలుగో అనుమానితుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మిన్నెసోటా, లూసియానాలో పోలీసులు ఇద్దరు నల్లజాతీయులను కాల్చిచంపడాన్ని నిరసిస్తూ గురువారం రాత్రి వందలాదిమంది నల్లజాతీయులు ఆందోళన చేపట్టారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసనకారులు మార్చ్ నిర్వహించారు. డల్లాస్లోని బెలో గార్డెన్ పార్క్ వద్ద గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో కాల్పులు ప్రారంభమయ్యాయి. నిరసనకారుల గుంపులోని నుంచి కొందరు పోలీసులపై కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ దాడిలో నిరసనకారులు కూడా చనిపోయినట్టు వార్తలు వచ్చినా పోలీసులు ధ్రువీకరించలేదు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.
మిన్నెసోటాలో నల్లజాతీయుడిని పోలీసు అధికారి కాల్చిచంపిన సంగతి తెలిసిందే. కారులో వెళుతున్న ఫిలాండో కాసిల్ (32) అనే వ్యక్తి వద్ద తుపాకి ఉండటాన్ని చూసిన అధికారి అతని వైపు గన్ చూపించారు. కాసిల్ తన గన్ లైసెన్స్ చూపేలోపే పోలీసు అధికారి కాల్చి చంపాడని అతనితో పాటు కారులో ఉన్న ప్రేయసి డైమండ్ రెనాల్డ్స్ ఘటన సమయంలో తీసిన లైవ్ వీడియోలో పేర్కొంది. అంతకుముందు లూసియానాలో కూడా ఇలాంటి ఘటనలోనే ఓ పోలీసు అధికారి ఆల్టన్ స్టెర్లింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు. వందలమంది ప్రజలు ఆస్టన్, కాసిల్ లు మరణించిన ప్రదేశాలకు తరలివెళ్లి నిరసన తెలిపారు.