
కారు డోర్లు లాక్..బాలుడి మృతి
హోస్టన్: కారు డోర్లు లాక్ అవ్వడంతో అందులో ఇరుక్కున్న మూడేళ్ల బాలుడు లోపలున్న వేడికి, ఊపిరాడక మృతిచెందాడు. బొమ్మ కోసం కారులోకి వెళ్లిన ఇవాన్ ట్రాంపోలినో(3) ప్రమాదవశాత్తూ డోర్లు లాక్ అవ్వడంతో అందులోనే ఇరుక్కు పోయాడు. కారు అద్దాలు పూర్తిగా మూసి ఉండటంతో బాలుడికి లోపల గాలి అందక పోవడం, ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండటంతో వేడికి బాలుడు మరణించాడని డాక్టర్లు తెలిపారు. ఈ విషాద ఘటన యూఎస్ లోని హోస్టన్‌లో చోటుచేసుకుంది.
ఇంటి సమీపంలో పార్కింగ్ చేసిన కారులో బొమ్మను తీసుకుందామని ఇవాన్ ఎక్కాడు. అయితే అదే సమయంలో డోర్లు లాక్ అయ్యాయి. దీంతో ఆ బాలుడు వెనక సీటులో ఉన్న బొమ్మను తీసుకుని బయటకురావడానికి ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. అరగంట తర్వాత కారులో పడిపోయిన బాలున్ని తల్లిదండ్రులు గుర్తించారు. వెంటనే కృత్రిమ శ్వాస అందించి ఆసుపత్రికి తరలించారు. లేడన్ లోని జాన్సన్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగానే బాలుడు మృతిచెందినట్టు డాక్టర్లు తెలిపారు.