కొత్త సంవత్సరంలో విషాదం
మనీలా: నూతన సంవత్సరం వేడుకలు వారి జీవితాల్లో కొత్త వెలుగులను నింపాల్సిందిపోయి విషాదంలో ముంచివేశాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఫిలిప్పీన్స్ ప్రజలు శుక్రవారం పేల్చిన బాణసంచా వారి జీవితాలను మృత్యుముఖంలోకి తీసుకెళ్లాయి. ప్రమాదకరమైనా క్రాకర్స్‌ను కాల్చవద్దంటూ ప్రభుత్వం ఎన్ని విధాలుగా హెచ్చరికలు చేసిన పట్టించుకోక పోవడం వల్ల మనీలాలో ఓ యువకుడు చనిపోగా, వందల సంఖ్యలో గాయపడ్డారు. దేశవ్యాప్తంగా 1200 గుడిసెలు కాలిపోగా, దాదాపు నాలుగు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరు చేతి వేళ్లను శాశ్వతంగా కోల్పోవాల్సి వచ్చింది.
ప్రభుత్వ ముందస్తు హెచ్చరికలను వారు పట్టించుకోక పోవడానికి కారణం వారిలో గూడుకట్టుకున్న మూఢ విశ్వాసాలే. కొత్త సంవత్సరం సందర్భంగా బాణసంచాను భారీగా కలిస్తే దుష్ట శక్తులు పారిపోతాయన్నది వారి నమ్మకం. ప్రతి ఏటా క్రాకర్స్ కారణంగా వందలాది మంది క్షతగాత్రులవుతున్నా వారు లెక్క చేయడం లేదు. గతేడాది అధికారిక గణాంకాల ప్రకారమే 860 మంది గాయపడ్డారు. ఈ ఏడాది అలా జరుగకూడదనే ఉద్దేశంతో ఒకటవ తేదీన ‘ఏసుక్రీస్తు’ చెక్కబొమ్మతో జరపాల్సిన ర్యాలీని ఒకరోజు ముందుగానే జరిపి ప్రార్థనలు జరిపారు. అయినా ప్రమాదాలు ఆగలేదు. గిన్నీస్ రికార్డు కోసం క్రిస్టో నగరంలో ఒకే చోట ఏడు లక్షల క్రాకర్స్ కాల్చారు. అక్కడ పెద్ద ప్రమాదం జరగక పోవడం అదృష్టం.