ప్రశాంతతే అతిపెద్ద లగ్జరీ..!
కార్లు, గాడ్జెట్లను లగ్జరీ వస్తువులుగా చూసే కాలం చెల్లి పోయింది. పరుగుల బతుకుల్లో ప్రశాతను కోరుకునే వారే ఎక్కువైపోయారు. సెలవుల్లోనూ, ఖాళీ సమయాల్లోనూ కారులో షికారుకెడదామన్న ఆలోచననూ వదిలేశారు. ఒంటరిగా ఓ గంట గడపడమే ఎంతో అపురూపంగా ఫీలవుతున్నారు. ఇప్పుడు భారతీయుల్లో సగానికిపైగా జనం ప్రశాంతతనే కోరుకుంటున్నారని సర్వేలు సైతం చెప్తున్నాయి. ఈ కాలంలో ఒంటరితనమే అత్యంత లగ్జరీ వస్తువు అని ఇటీవల జరిపిన ఓ సర్వే తేల్చి చెప్పింది.
నేటితరం వ్యక్తిగత సమయం, స్వేచ్ఛ కోరుకుంటోందని ఓ సంస్థ చేపట్టిన గ్లోబల్ సర్వే చెప్తోంది. తైవాన్ల ప్రధాన టెక్ సంస్థ ఆసస్ (ASUS) నిర్వహించిన సర్వేలో భారతదేశంలో నలభై శాతం మంతి ప్రజలు స్వేచ్ఛగా, వారికి ఇష్టమైనట్లుగా సమయాన్ని గడపడం లగ్జరీగా భావిస్తున్నారని తెలుసుకున్నారు. మిలీనియల్ కన్జూమర్ గ్లోబల్ సర్వే లో భారతదేశం, అమెరికా, బ్రిటన్, రష్యా, ఇండోనేషియా సహా అయిదు ప్రాంతాల్లోని సుమారు 19 నుంచి 35 ఏళ్ళ మధ్య వయసున్నవినియోగదారులు పాల్గొన్నారు. వీరిలో భారతదేశ ప్రజలు ఎక్కువగా ఒంటరితనాన్ని, స్వేచ్ఛగా గడపడాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లుగా తెలుసుకున్నారు.
ప్రజల జీవితాల్లో 'టాబ్లెట్ల' పాత్ర గురించి తెలుసుకునేందుకు ఆసస్ (ASUS) సంస్థ సర్వే నిర్వహించింది. ఎటువంటివారు తమ టెక్నాలజీని ఎక్కువగా వినియోగిస్తున్నారు అన్న విషయంపై ఆ సంస్థ నిర్వహించిన సర్వేలో... వ్యక్తుల స్వభావాలగురించి వెల్లడైంది. నేటితరం ప్రజలు కొత్త పంథాలో ఆలోచిస్తున్నారనీ, సమూహంలో ఉండేకంటే... తమకిష్టమైనట్లుగానూ, స్వేచ్ఛగానూ ఉండేందుకే ఇష్టపడుతున్నారని మొబైల్ ప్రొడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఎరిక్ హెర్మాన్సన్ తెలిపారు. ముఖ్యంగా 1980 తర్వాత పుట్టినవారు వ్యక్తిగత స్వేచ్ఛను, ఒంటరి సమయాన్ని లగ్జరీగా భావిస్తున్నట్లు తెలిపారు. రోజువారీ జీవితాన్ని ఆస్వాదించడంలో మొబైల్స్, టాబ్లెట్స్ వంటి వస్తువులు సహకరిస్తున్నాయని అరవై శాతం మంది చెప్తున్నట్లు సర్వే ద్వారా తెలుసుకున్నారు. టెక్నాలజీ కూడ రొటీన్ నుంచి ప్రశాంతతను అందిస్తున్నట్లుగా జనం భావిస్తున్నారంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి కుటుంబాలు, స్నేహ సంబంధాలకు దూరంగా ఉంటున్న స్పీడు యుగంలో... ఒంటరిగా, స్వేచ్ఛగా బతకడమే సౌఖ్యంగా భావించే వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా మరోమారు వెల్లడైంది.