6.1 కి.మీ. ప్రయాణించిన క్యూరియాసిటీ!
వాషింగ్టన్: అరుణగ్రహంపై చక్కర్లు కొడుతున్న నాసా క్యూరియాసిటీ రోవర్ ఏప్రిల్ 2న తీసిన ‘కింబర్లే’ ప్రదేశం ఫొటో ఇది. 2012, ఆగస్టులో మార్స్ పై గేల్‌క్రేటర్ ప్రాంతంలో దిగిన క్యూరియాసిటీ ఈ ఏప్రిల్ 2 నాటికి 6.1 కి.మీ. దూరం ప్రయాణించి ‘కింబర్లే’ అనే ఈ కీలక ప్రాంతానికి చేరుకుంది. ఇక్కడ ఒకేదగ్గర , భౌగోళికంగా పరస్పర సంబంధంతో ఉన్న రకరకాల శిలలను క్యూరియాసిటీ పరిశీలించనుంది.
ఈ శిలల విశ్లేషణతో మార్స్‌పై గతంలో ఎలాంటి వాతావరణం ఉండేదన్న దానికి సంబంధించి మరిన్ని ఆధారాలు దొరుకుతాయని భావిస్తున్నారు. దారిపొడవునా.. మట్టిని, శిలలను విశ్లేషిస్తూ 10 కి.మీ. దూరంలోని గమ్యస్థానమైన మౌంట్ షార్ప్ పర్వతం వైపుగా కదులుతున్న క్యూరియాసిటీ... అంగారకుడిపై ఒకప్పుడు నీరు ప్రవహించిందని, ఓ చోట సరస్సు కూడా ఉండేదని కనుగొనడంతోపాటు అక్కడి మట్టిలో కీలకమైన ఖనిజాల ఆనవాళ్లను కూడా గుర్తించిన సంగతి తెలిసిందే.