ఒక్క సెకన్‌లో 6,000 సినిమాలు!
లండన్: ఇంటర్‌నెట్ ఓపెన్ చేసి ఏదైనా సినిమా డౌన్‌లోడ్ పెట్టారు.. లేదా ఏవైనా పాటల ఆల్బమ్ కాపీ చేసుకుంటున్నారు.. ఎంత సేపు పడుతుంది? మామూలు బ్రాడ్‌బ్యాండ్‌తో అయితే గంట, గంటన్నర... మంచి వేగం ఉన్న కనెక్షన్‌పై అయితే.. పది నిమిషాలో, పావుగంటో పడుతుంది. అదే కేవలం ఒకే సెకన్‌లో 6,000 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోగలిగితే..!? సూపర్ కదూ! డెన్మార్క్ టెక్నలాజికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సెకనుకు 43 టెరాబిట్ల (5504 జీబీల) వేగంతో సమాచారాన్ని ప్రసారం చేయగలిగారు.
జపాన్‌కు చెందిన టెలికం సంస్థ ఎన్‌ఎన్‌టీ సహకారంతో రూపొందించిన ఏడు గాజు తీగలున్న కొత్త తరహా ఫైబర్ ఆప్టిక్ కేబుల్‌ను దీనికోసం వినియోగించారు. సాధారణ కేబుల్‌లో ఒకే తీగను వాడతారు. అయితే ఈ కేబుల్‌లో ఏడు తీగలున్నా.. పరిమాణం మాత్రం సాధారణ కేబుల్ స్థాయిలోనే ఉండడం గమనార్హం. కాగా, ఇంతకుముందు జర్మనీకి చెందిన శాస్త్రవేత్తలు సెకనుకు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా 32 టెరాబిట్ల వేగంతో సమాచారాన్ని ప్రసారం చేశారు.