పుట్టపర్తి: ప్రతి మనిషి దేవునిపై విశ్వాసం ఉంచి లక్ష్య సాధనకు పాటుపడితే విజయం తప్పక వరిస్తుందని ముంబయి విశ్వవిద్యాలయం విశ్రాంత వైస్ చాన్సలర్ డాక్టర్ స్నేహలత దేశ్‌ముఖ్ అన్నారు. సత్యసాయి 89వ జయంత్యుత్సవాలలో భాగంగా బుధవారం అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో 19వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దేశ్‌ముఖ్ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ క్రమశిక్షణ, నిబద్ధత, ఆధ్యాత్మిక చింతన, మానవతా విలువలను ఆచరిస్తూ జీవనయానాన్ని సన్మార్గంలో సాగించాలన్నారు.
మహిళా లోకానికి సత్యసాయి చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యురాలు మాధురీ నాగానంద్ మాట్లాడుతూ ప్రతి తల్లి.. తన బిడ్డను సత్ప్రవర్తనతో తీర్చిదిద్దాలని, అప్పుడే ఉత్తమ సమాజ స్థాపన సాధ్యమని అన్నారు. అనంతపురం మహిళా కళాశాల క్యాంపస్ డెరైక్టర్ ప్రొఫెసర్ మధు కపాణి మాట్లాడుతూ మహిళా సాధికారతతోనే సమాజాభివృద్ధి సాధ్యమని భావించిన సత్యసాయి మహిళా విద్యను ప్రోత్సహించారని గుర్తు చేశారు. అనంతరం విద్యార్థుల సంగీత కచేరి ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఈశ్వరాంబ ట్రస్ట్ సభ్యురాలు మల్లికా శ్రీనివాసన్, దేశ విదేశాలకు చెందిన సత్యసాయి సేవా సంస్థల మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.
దేవునిపై విశ్వాసంతో కృషి చేయాలి
Published Thu, Nov 20 2014 2:50 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement
Advertisement