సేఫ్ గా ఇంటికి చేరేందుకు బ్రాస్లెట్..!
తప్పిపోయిన వారిని వెతికేందుకు ఎంతో కష్టపడుతుంటాం. పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటాం. వారి జాడ తెలుసుకునేందుకు ప్రకటనలు కూడ ఇస్తాం. అయితే ఇటువంటి కష్టాలకు ఇప్పుడు దూరం కావచ్చు అంటున్నారు క్వీన్స్ ల్యాండర్ పోలీసులు. సమస్యను అధిగమించేందుకు ఓ బ్రాస్ లెట్ ప్రాజెక్టును ప్రయోగించారు. ఈ ప్రాజెక్టు ద్వారా చిత్త వైకల్యం కలిగిన వ్యక్తుల జాడ తెలుసుకొని, వారిని భద్రంగా ఇంటికి చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా యూనిక్ నెంబర్ చెక్కి ఉన్న బ్రాస్ లెట్ ను జారీ చేస్తున్నారు.
నిజానికి ఈ ప్రోగ్రామ్ ను పోలీస్ మినిస్టర్ ఏప్రిల్ లోనే ప్రారంభించారు. క్వీన్స్ ల్యాండ్ లోని సుమారు మూడు వందల ఇళ్ళలో ఉండే వైకల్యం కలిగిన వ్యక్తులకు ఈ బ్రాస్ లెట్ ను అందజేశారు. ఈ బ్రాస్లెట్ ధరించడం వల్ల బయటకు వెళ్ళి తప్పిపోయినవారి జాడ సులభంగా తెలుసుకోగల్గుతారు. అయితే క్వీన్స్ ల్యాండ్ లో సుమారు అరవై రెండువేల మంది వరకూ చిత్త వైకల్యంతో బాధపడుతున్న వారు ఉన్నట్లుగా గుర్తించారు. క్రమంగా వీరందరికీ బ్రాస్లెట్ లు అందించేందుకు ప్రయత్నిస్తున్నారు.
క్వీన్స్ ల్యాండ్ పోలీస్ సర్వీస్, అల్జిమర్స్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రాజెక్టు ద్వారా చిత్త వైకల్యంతో బాధపడే వ్యక్తులు సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రోసర్ పైన్ రెస్పైట్ కేర్ సెంటర్ పేరున ఓ పబ్లిక్ ఫోరమ్ ను కొత్తగా ప్రారంభిస్తున్నారు. సేఫ్లీ హోమ్ బ్రాస్లెట్లతోపాటు, ప్రాజెక్టు ద్వారా మరిన్ని సేవలు అందించనున్నారు.