యాజమాని కోసం కుక్క ప్రాణత్యాగం
ఎవరైనా నమ్మినవారు ద్రోహం చేస్తే 'కుక్కకుండే విశ్వాసం కూడా లేదంటూ' నిందించడం పరిపాటి. అమెరికాలోని ఓ కుక్క తన యజమానిపై అంతులేని విశ్వాసం చూపడమే కాదు అతని ప్రాణాలను కాపాడటం కోసం ఏకంగా తన ప్రాణాలను బలితీసుకుంది. మనుషుల్లోనే కాదు కుక్కల్లోనూ త్యాగజీవులుంటాయని నిరూపించింది. అట్లాంటాకు చెందిన డేవ్ ఫురుకవా.. సిమోన్ అనే మగ కుక్కను పెంచుకుంటున్నాడు.
ఇటీవల ఫురుకవా తన నాలుగేళ్ల కొడుకు విల్ను తీసుకుని స్కూల్కు బయల్దేరాడు. ఆ సమయంలో వారి వెంట కుక్క్ కూడా ఉంది. కాలినడకన ఓ రోడ్డును దాటే సమయంలో వారు సిగ్నల్ను గమనించలేదు. అటుగా ఓ కారు వేగంగా విల్ వైపు దూసుకొస్తోంది. సిమోన్ వెంటనే అప్రమత్తమై ఆ బాలుణ్ని రోడ్డు పక్కకు తోసివేసింది. దీంతో విల్ సురక్షితంగా బయటపడ్డాడు.
అయితే కుక్కను కారు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడింది. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో మరణించింది. ఈ సంఘటన అందర్నీ కలచివేసింది. కుక్క సాహసం, ప్రాణత్యాగన్ని కొనియాడుతూ హీరోగా అభివర్ణించారు. సిమోన్ తప్పించుకునే అవకాశం ఉన్నా తన కొడుకును కాపాడే ప్రయత్నంలో ప్రాణం త్యాగం చేసిందని ఫురుకవా చెమర్చిన కళ్లతో నివాళులర్పించాడు.