వేరే ఇంటి డోర్ కొట్టి ప్రాణాలు పోగోట్టుకున్నాడు
మసాచుసెట్స్: బాగా తాగిన ఓ టీనేజీ యువకుడు తన స్నేహితుడి ఇంటికి కాకుండా మరో ఇంటికి వెళ్లి డోర్ కొట్టిన కారణంగా ప్రాణాలు కోల్పోయాడు. ఆ ఇంటి యజమాని భయపడిపోయి తుపాకితో కాల్పులు జరపడంతో ఆ బుల్లెట్లు కాస్త ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లి చనిపోయాడు. ఈ ఘటన మసాచుసెట్స్ లోని చికాపీ అనే ప్రాంతంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చికాపీలో ఇద్దరు యువకులు మద్యాహ్న సమయంలోనే ఫుల్లుగా తాగేశారు.
అనంతరం తన స్నేహితుడి ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. మద్యం మత్తులో స్నేహితుడి ఇంటి తలుపును కాకుండా జెఫ్రీ లావెల్ (42) అనే వ్యక్తి ఇంటి డోర్ ను కొట్టారు. అందులో ఓ పదిహేనేళ్ల యువకుడు పదేపదే డోర్ ను తన్నడంతో ఆ డోర్ కు ఉన్న అద్ధం ఒకటి పగిలిపోయింది. దీంతో ఆ ఇంటి యజమాని జెఫ్రీ దోచుకోవడానికి వచ్చిన అగంతకులేమో అని భ్రమపడి అవతలి వైపునుంచే కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్లు కాస్త ఆ యువకుడి పొట్టలోకి దూసుకెళ్లాయి.
అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అయితే, అతడు చేసిన పొరపాటును జడ్జి తప్పుబట్టారు. తలుపుకొట్టినంత మాత్రాన అవతలి వ్యక్తిపై అలా నిర్ణయానికి ఎలా వస్తారని, కాల్పులెలా జరుపుతారని అన్నారు. ఏదేమైనా ఇద్దరి కుటుంబాల్లో విషాదం నిండిపోవడం కొంత బాధాకరం అని చెప్పారు. కాగా, జెఫ్రీ ఫేస్ బుక్ పేజీల్లో అతడికి తుపాకులు అంటే బాగా పిచ్చి అన్నట్లుగా ఉంది.